నిష్క్రమణ బాటలో వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు!

వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తుండటం తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరయలు సహితం తిరిగి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరాకరించడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  తెలుగు దేశంపై బలమైనదిగా భావించే గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినా విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. 
 
నరసరావుపేట ఎంపీ స్థానం నుంచే లావుకు టికెట్ ఇవ్వాలని ఆ నియోజకవర్గ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ జగన్ నిరాకరించడంతో కలకలం రేగుతుంది. దీంతో, గుంటూరు నుంచి తాను పోటీ చేయలేనని, ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటానని లావు స్పష్టం చేశారు. నరసరావుపేట టికెట్ ను బీసీలకు ఇవ్వానుకుంటున్నట్టు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.
 
దానితో ఆయన టిడిపి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదివరకే వైసిపి నేతలు దూరంగా ఉంటున్న అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించి సంచలనం సృష్టించారు. స్వయంగా వెళ్లి రైతులను కలిసి వచ్చారు.  ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలుతో సంప్రదింపులు ప్రారంభించారు.
నర్సరావుపేట నుంచే టీడీపీ అభ్యర్దిగా అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. నర్సరావుపేటలో ఎంపీగా కేంద్ర నిధులతో పాటుగా సొంత నిధులతో లావు శ్రీకృష్ణదేవరాయలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. నర్సరావుపేట ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
శ్రీకృష్ణదేవరాయలును నర్సరావుపేటలో కొనసాగిస్తే ఆయన పార్టీలోనే ఉండే అవకాశం ఉంది. సీటు మార్చితే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.