
అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనుండగా యావత్తు దేశం ఆ మధుర ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కాగా, రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను చూసేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.
ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతున్నట్టు ఈవో వెల్లడించారు. ఈ ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉండగా అయోధ్య కోసం 25 గ్రాముల ఉండే లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించనున్నట్లు తెలిపారు.
కాగా, సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు.
సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా ఏర్పాటు చేయాలని సూచించారు. సదస్సులో స్వామీజీల సూచనలు, సలహాల మేరకు సనాతన హైందవ ధర్మ ప్రచారంకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. అనంతరం సదస్సు నిర్వహణకు సీనియర్ అధికారులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి ఈవో సమీక్షించారు.
ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15న తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు ‘‘శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిమని తెలిపారు.
శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు. తిరుమలలో జనవరి 16న కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తారు.
తిరుమలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని, ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులను వినియోగిస్తున్నామని చెప్పారు. టీ స్టాళ్ల యజమానులతో చర్చించి మట్టి కప్పులు వినియోగించేలా అవగాహన కల్పిస్తామని ఈవో పేర్కొన్నారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు