మరో 5 బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలు

దేశంలోని బ్యాంకులపై గట్టి నిఘా పెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన వాటిపై వరుసపెట్టి చర్యలకు ఉపక్రమిస్తున్నది.  తాజాగా మరో 5 బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్‌బీఐ. రెగ్యులేషన్ రూల్స్ అతిక్రమించినట్లు గురించిన క్రమంలో గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న 5 కోఆపరేటివ్ బ్యాంకులపై రూ.50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానాలు విధించింది.
 
2023, డిసెంబర్13న వడోదరా కేంద్రంగా పని చేస్తున్న శ్రీ భారత్ కోఆపరేటివ్ బ్యాంక్ పై రూ.5 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపింది. అర్బణ్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకులతో డిపాజిట్ల ప్లేస్ మెంట్ పై ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు, 2016 నాటి డిపాజిట్ల ఆదేశాలపై వడ్డీ రేటుపై నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. 
 
రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడం, బ్యాంకు తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా ట్రాన్సాక్షన్ లేదా ఒప్పందం చెల్లుబాటుపై వివరాలు వెల్లడించకపోవడంతో ఈ 5 బ్యాంకులపై మానీటరీ జరిమానాలు వేసినట్లు తెలిపింది. మరోవైపు 2023, డిసెంబర్ 7న ఇచ్చిన మరో ఉత్తర్వులో  డైరెక్టర్లు, బంధువులు, సంస్థలకు రుణాలు, అడ్వాన్సులపై ఆదేశాలను పాటించనందుకు గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లా, సంఖేడాలో ఉన్న సంఖేడా నాగరిక్ సహకారి బ్యాంక్‌పై రూ. 5 లక్షల మానీటరీ పెనాల్టీ వేసినట్లు తెలిపింది.
ప్రాథమిక సహకార బ్యాంకుల ద్వారా ఇతర బ్యాంకులలో డిపాజిట్లపై నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానాలు వేసినట్లు తెలిపింది. అలాగే డిసెంబర్ 8, 2023న కచ్ జిల్లాలోని భుజ్ కమెర్షియల్ కోఆపరేటివ్ బ్యాంకుపై రూ.1.50 లక్షలు జరిమానా వేసినట్లు తెలిపింది. ఈ బ్యాంకు కేవైసీ నిబంధనలు పాటించకపోవడం, డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలోనూ అవకతవకలకు పాల్పడినట్లు తెలిపింది.


అలాగే డిసెంబర్ 13న దోహద్ జిల్లాలోని లిమ్డిలో ఉన్న లిమ్డి అర్బణ్ కోఆపరేటివ్ బ్యాంకుపై రూ.50 వేలు జరిమానా వేసినట్లు తెలిపింది. డిపాజిట్ రేట్లపై ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని తెలిపింది. అలాగే డిసెంబర్ 7న పర్లాఖేముండిలోని కోఆపరేటివ్ అర్బణ్ బ్యాంకుపై రూ.1.50 లక్షలు జరిమానా విధించినట్లు వెల్లడించింది.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల సభ్యత్వానికి సంబంధించి ఆదేశాలను పాటించకపోవడం, యూసీబీలపై నిబంధనలు, చట్టపరమైన ఆంక్షలను పట్టించుకోకపోవడంపై ఈ జరిమానా విధించినట్లు తెలిపింది.