ఇజ్రాయిల్‌ దాడిలో హమాస్‌ డిప్యూటీ నేత హతం

* మధ్యవర్తిత్వం నుండి వైదొలిగిన ఈజిప్ట్

హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధం లెబనాన్‌ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఇజ్రాయిల్‌ దాడిలో హమాస్‌ డిప్యూటీ నేత సలేహ్  అల్‌ -అరూరీని హత్య చేసినట్లు లెబనాన్‌లోని భద్రతా అధికారులు తెలిపారు.  వెస్ట్ బ్యాంకులో హమాస్ సాగిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను కీలక సూత్రధారిగా అతనిని భావిస్తున్నారు. 

చాలాకాలంగా అతని కోసం ఇజ్రాయిల్ దళాలు వెతుకుతున్నాయి. ఇజ్రాయిల్‌ దాడిలో హమాస్‌ డిప్యూటీ అరూరీ, ఆయన అంగరక్షకులతో సహా మరణించారని ఉన్నతస్థాయి భద్రతా అధికారి మీడియాకు తెలిపారు.  మరో భద్రతా అధికారి ఈ సమాచారాన్ని ధృవీకరించారు.  లక్షిత దాడిలో భవనం రెండతస్తులు, కారు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

ఇరాన్‌ మద్దతు గల హిజ్బుల్లా ఉద్యమానికి బలమైన కోట అయిన బీరూట్‌ దక్షిణ శివారులోని హమాస్‌ కార్యాలయాన్ని ఇజ్రాయిల్‌ దాడి తాకినట్లు లెబనీస్‌ స్టేట్‌ మీడియా నివేదించింది. మంగళవారం సాయంత్రం ఇజ్రాయిల్ దళాలు డ్రోన్ ద్వారా ఈ దాడి జరిపిన్నట్లు కూడా వెల్లడించింది.  కాగా, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధ విరమణకు ఇంతకాలం ఖతార్‌తోపాటు ప్రయత్నించిన ఈజిప్ట్‌.. మధ్యవర్తిత్వం నుంచి తప్పుకొంటోంది.

ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఖతార్‌ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(ఐబీసీ) కూడా దీనిపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. ఓ వైపు శాంతి కోసం తాము ప్రయత్నాలు చేస్తుంటే.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స (ఐడీఎఫ్‌) లెబనాన్‌లో ఉన్న హమాస్‌ నేత సలేహ్‌ అల్‌-అరౌరీని తుదముట్టించడమే ఈజిప్టు నిర్ణయానికి కారణమని ఆ కథనాలు స్పష్టం చేశాయి.

డిప్యూటీ నేత అరూరీ బీరూట్‌లో హత్యకు గురైనట్లు హమాస్‌ టివి కూడా నివేదించింది. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మరణించినట్లు లెబనీస్‌ మీడియా తెలిపింది. అయితే ఈ దాడి గురించి ఇజ్రాయిల్ అధికారులు మౌనం పాటిస్తున్నారు. అమెరికా అధికారులు అనధికారికంగా ఈ దాడి ఇజ్రాయిల్ జరిపినట్లు పేర్కొంటున్నారు.

హమాస్‌ కీలక నేతలు ఇజ్రాయెల్‌ హిట్‌లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్టోబరు 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేశాక.. ఆ దృశ్యాలను లైవ్‌లో చూస్తూ.. ‘థాంక్స్‌ గీవింగ్‌’ ప్రార్థనలు చేసిన ముఖ్య నాయకులను ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా చేసుకుంది.  హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సభ్యులు జకారియా అబూ ముమ్మార్‌, జావేద్‌ అబూ, హమాస్‌ వైమానిక విభాగం చీఫ్‌ మురాద్‌ అబూ-మురాద్‌, ఎలైట్‌ ఫోర్స్‌ కమాండర్‌ అలీ అల్‌ ఖాదీ తదితరులను ఐడీఎఫ్‌ ఇప్పటికే తుదముట్టించింది. మరో ఐదుగురు కీలక నేతలను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ దాడితో గత మూడు నెలలుగా సాగుతున్న ఇజ్రాయిల్- హమాస్ యుద్ధం మరింత ఉధృతంగా మారవచ్చన్న భయాందోళనలు తీవ్రమవుతున్నాయి.  ఇజ్రాయిల్‌ దాడిలో ఇప్పటివరకు సుమారు 22,185 మంది పాలస్తీనియన్లు మరణించగా, వారిలో ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.