
సావిత్రిబాయి ఫూలే వేల ఏళ్లుగా మన సమాజంలో పాతుకుపోయిన రుగ్మతలను రూపుమాపేందుకు తన సర్వస్వాన్ని ధారపోసిన వీర వనిత.. సావిత్రిబాయి ఫూలే. కుల వివక్ష, అంటరానితనం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాల వంటి అసమంజస, అమానవీయ పద్ధతులపై జీవితాంతం పోరాడిన పోరాటయోధురాలు. అందరూ సమానమే, అందరికీ చదువుకోవాలని, అందరికీ సంపద హక్కులు ఉండాలని చాటి చెప్పిన ధీశాలి. అట్టడుగు వర్గాల జీవితాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన సావిత్రిబాయి ఫూలే 193 వ జయంతి నేడు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో 1831 జనవరి 3న ఓ పేద రైతు కుటుంబంలో జన్మించింది.. సావిత్రిబాయి ఫూలే. 11 ఏళ్లకే జ్యోతిరావుఫూలేతో వివాహం జరిగింది. వాస్తవానికి ఆమెకు అక్షర జ్ఞానం లేదు. కానీ తన భర్తనే గురువుగా చేసుకుని.. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. 1848 లో పూణేలో 9 మంది బాలికలతో ఓ పాఠశాలను ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి బాలికా పాఠశాలగా చరిత్ర కెక్కింది.
అయితే ఇది నచ్చని అగ్రవర్ణాలకు చెందిన వారి నుంచి ఎన్నో భౌతిక, మానసిక దాడులకు పాల్పడ్డారు. అయినా వెనకడుగు వేయకుండా.. వాటన్నింటినీ ఎదుర్కొని నిలిచింది. దళితులు, స్త్రీ విద్య కోసం కృషి చేసింది. అలా మొదలైన ఆమె ప్రస్తానం.. తన జీవితకాలంలో ఏకంగా 52 పాఠశాలలు ప్రారంభించే వరకు కొనసాగింది. అయితే కేవలం స్త్రీలకు విద్య వరకే ఆగకుండా.. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్షపై ఆమె పోరాటం కొనసాగించింది.
కుల వివక్ష, అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి సామాజిక రుగ్మతలను రూపుమాపే అనేక ఉద్యమాలలో సావిత్రిబాయి ఫూలే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బాలికల చదువు కోసం పాఠశాలలు ప్రారంభించినట్లుగానే.. వితంతువులకు పునర్వివాహలు చేయడానికి, దిక్కు లేని మహిళలు పురుడు పోసుకునేందుకు కూడా పునరావాస కేంద్రాలను నిర్వహించారు. మహిళా హక్కులే మానవ హక్కులు అని నినదించి.. స్త్రీల సాధికారత కోసం 1852 లో సేవా మండల్ సంఘాన్ని స్థాపించింది.
కులవ్యవస్థతో నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873లో భర్తతో కలసి ‘సత్యశోధక్ సమాజ్’ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాగే పురోహితులు లేకుండా వివాహాలు జరుపుకునే విధానాన్ని ప్రారంభించారు. వితంతువుల పునర్వివాహాల కోసం బ్రాహ్మణిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు.
బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. ఏ దిక్కు లేని గర్భవతులైన వారికి.. పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు.
1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం, ప్లేగు వ్యాధి ప్రభలినప్పుడు దాదాపు 2 వేల మంది అనాధ బాలలను అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆనాడే ప్రారంభించారు. అందుకోసం.. జోలె పట్టి విరాళాలు సేకరించారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు ఆమె ఎంతో సేవ చేసింది.
దీంతో చివరకు అదే ప్లేగు బారిన పడి ఆమె 1897 మార్చ్ 10 న మరణించింది. సావిత్రిబాయి ఫూలే సంఘ సంస్కర్తగానే కాకుండా.. రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసి.. అంధకార జీవితాల్లో అక్షర వెలుగులు పంచిన ఆమె.. అణగారిన వర్గాల జీవితాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు