31 ఏళ్ళ అయోధ్య కేసు తిరగ తోడుతున్న కర్ణాటక ప్రభుత్వం

అయోధ్యలో దిగ్విజయంగా రామమందిర నిర్మాణం పూర్తవుతుండటం, విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈ నెలలో జరగబోతుండడంతో దేశ, విదేశాలలో పండుగ వాతావరణం నెలకొన్న సమయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామభక్తులపై విద్వేష పూరితంగా వ్యవహరిస్తోంది.  రామజన్మభూమి కోసం పోరాటం చేసిన 31 ఏళ్ల క్రితం నమోదు అయిన కేసులో ఇప్పుడు ఓ నిందితుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది.

మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో 3వ నిందితుడు శ్రీకాంత్ పూజారిని గత శుక్రవారం కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.  కేసు నమోదు అయిన సమయంలో ఆ కేసులోని నిందితులు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులు. ఇప్పుడు వారందరికీ 65-70 ఏళ్లు ఉంటాయి.

రాజు ధర్మదాస్, శ్రీకాంత్ పూజారి, అశోక్ కలబురగి, షణ్ముఖ్ కటగర, గురునాథ కటిగార, రామచంద్ర కలబురగి, అమృత కలబురగి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  కరసేవకు ముందు అంటే 1992 డిసెంబర్ 5వ తేదీన హుబ్బళి నగరంలో అల్లర్లు జరిగి ఓ దుకాణానికి నిప్పు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి హుబ్బళిలోని షహర్ పోలీస్ స్టేషన్‌లో 31 ఏళ్ల క్రితం 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ప్రస్తుతం ఈ పాత కేసును రీ ఓపెన్ చెయ్యాలని హుబ్బళి పోలీసులు నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది.  సిద్దరామయ్య ప్రభుత్వం చర్యలను నిరసిస్తూ బిజెపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం భారీ నిరసనలు చేపట్టారు.  ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో గుర్తించబడిన నిరసనల సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోకతో సహా బిజెపి నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 

బెంగళూరులో, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి వై విజయేంద్ర నేతృత్వంలో నిరసన చేపట్టి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు వినతి పత్రం సమర్పించారు.
అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్టకు ముందు కేవలం కర్ణాటకలోని హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి దుష్క్యార్యకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని హిందూ-వ్యతిరేక చర్యగా విజయేంద్ర మండిపడ్డారు.
 
రాష్ట్రంలో ఓ హిందూ కార్యకర్తను అరెస్ట్ చేయడం ద్వారా శాంతి, సమరస్యాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఆయన ఆరోపించారు.  ఉగ్రవాదులైన పిఎఫ్ఐ శ్రేణులపై కేసులు ఉపసంహరించుకొని, మూడు దశాబ్దాల నాటి కేసులను హిందువులపై తెరవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
 
రామజన్మభూమి ఉద్యమం నుంచి తప్పుడు కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఆనాడు ప్రాణాలతో బయటపడిన కార్యకర్తల అరెస్టులను  విహెచ్‌పి కేంద్ర జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ తీవ్రంగా ఖండించారు. 
 
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేష రాజకీయాలు చేస్తోందని, తాము దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బి శ్రీరాములు సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు, విద్వేష రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలతో కాంగ్రెస్ అంతం ప్రారంభమైందని విరుచుకుపడ్డారు.