ఉగ్రవాది హఫీజ్ సయీద్ పై ఎన్నడూ స్పందించని పాక్

ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నప్పటికీ దాయాది దేశం పాకిస్థాన్‌ ఎప్పుడూ స్పందించలేదని కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి ధ్వజమెత్తారు. 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాలని పాక్‌ను భారత్‌ అభ్యర్థించిన విషయం తెలిసిందే. 

ఉగ్రవాద ఘటనల్లో అనేక సంఘటన వెనుక హఫీజ్‌ సయీద్‌ ఉన్నాడని మంత్రి స్పష్టం చేశారు. ‘ముంబయి దాడుల వెనుక హఫీస్‌ సయీద్‌ ఉన్నాడని అందరికీ తెలుసు. భారతదేశంలో చాలా సంఘటనలు జరిగాయి. వాటి వెనుక హఫీజ్‌ సయీద్‌ ఉన్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో కూడా ఉన్నాడు. అయినా దీనిపై ఎప్పుడూ పాక్‌ స్పందించలేదు’ అని ఆమె మీడియాకు తెలిపారు. 

ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించాలని సంబంధిత ఆధారాలతో పాక్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ఆమె వెల్లడించారు. ఓ నిర్ధిష్ట కేసులో విచారణ కోసం భారత్‌కు అప్పగించాలని పాక్‌ను కోరినట్లు ఆమె తెలిపారు. కాగా, 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌ను భారత్‌కు అప్పగించేందుకు ప్రత్యేక కేసులో విచారణను ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వాన్ని భారత్ అభ్యర్థించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. 

అయితే, ఫిబ్రవరి 8, 2024న జరుగనున్న పాక్‌ సార్వత్రిక ఎన్నికల కోసం హఫీజ్‌ సయీద్‌ ఉగ్రసంస్థకు చెందిన రాజకీయ విభాగానికి చెందిన పాక్‌ మర్కాజీ ముస్లిం లీగ్‌ ఎన్నికల్లో పోటీకి దింపుతున్నది. ఈ క్రమంలోనే సయీద్‌ను అప్పగించాలని భారత్‌ కోరింది. హఫీజ్‌ సయీద్‌ తనయుడు తల్హా సయీద్‌ సైతం లాహోర్‌లోని నేషనల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు.

హఫీజ్ సయీద్ కుమారుడితో సహా రాడికల్ సంస్థలను పాకిస్థాన్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ పాక్‌ తన విధానంలో భాగంగా రాడికల్‌ సంస్థలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తోందని ఆరోపించారు. పరిస్థితిని భారత్ నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ, “మనీలాండరింగ్ కేసు”లో సయీద్‌ను అప్పగించాలని కోరుతూ పాకిస్తాన్ భారత అధికారుల నుండి అభ్యర్థనను అందుకుందని తెలిపారు. అయితే, పాకిస్తాన్, భారతదేశంల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ఉనికిలో లేదని గమనించాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తు చేశారు.

అయితే, అటువంటి ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం లేనప్పుడు కూడా అప్పగించడం సాధ్యమవుతుందని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. హఫీజ్ సయీద్‌ను 2008 సంవత్సరంలోనే ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్‌లు ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అతనిని అప్పగించిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతిని అమెరికా ప్రకటించింది.

హఫీజ్ సయీద్ ముంబయి దాడుల సూత్రధారి కాగా భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. హఫీజ్ సయీద్ 2019 నుంచి పాకిస్తాన్ జైలులో ఉన్నాడు. హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదానికి నిధుల సేకరణ ఆరోపణలపై పాకిస్తాన్ కోర్టు 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.