రంగురంగుల కాంతుల్లో ఆయోధ్య ధామ్‌ జంక్షన్‌

రంగురంగుల కాంతుల్లో ఆయోధ్య ధామ్‌ జంక్షన్‌
* ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’గా విమానాశ్రయం
 
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఇటీవల పునరుద్ధించిన అయోధ్య ధామ్‌ జంక్షన్‌ రంగురంగుల కాంతుల్లో తళుకులీనుతున్నది. ఈ నెల 30న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ రైల్వే జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ధామ్‌ జంక్షన్‌ను సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 
 
ఈ రైల్వే జంక్షన్‌తోపాటు శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. కాగా, ‘అయోధ్య రైల్వే జంక్షన్‌’ పేరును ‘అయోధ్య ధామ్‌ జంక్షన్‌’ గా మారుస్తున్నట్టు స్థానిక ఎంపీ లల్లూ సింగ్‌ బుధవారం ప్రకటించారు.  అదేవిధంగా, కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ  విమానాశ్రయం పేరును ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు’గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
విమానాశ్రయం మొదటి దశను రూ 1,450 కోట్ల వ్యయంతో సాలీనా 10 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు సౌలభ్యంగా తీర్చిదిద్దారు. నిర్మిస్తున్న రామ మందిర్ ఆకృతితో, శ్రీ రాముడి జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు.  అయోధ్య ధామ్ జంక్షన్‌తోపాటు శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రధాని పరిశీలిస్తారు.  ఈ సందర్భంగా అయోధ్య నగరంలో, చుట్టుపక్కల పౌర సదుపాయాలకు సంబంధించి రూ 11,000 కోట్ల విలువ గల వివిధ పధకాలను ప్రారంభిస్తారు. ఉత్తర ప్రదేశ్ లో రూ. 4,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇతర అభివృద్ధి పధకాలను కూడా ప్రారంభిస్తారు.

అయోధ్యలో త్వర‌లో రామ‌ మందిరం ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స్థానిక రైల్వే స్టేష‌న్‌ను అభివృద్ధి చేశారు. స్టేష‌న్‌లో ప్రయాణికుల‌ కోసం అత్యాధునిక వ‌స‌తులు, హంగులు క‌ల్పించారు. అభివృద్ధి ప‌రిచిన అయోధ్య ధామ్ రైల్వేస్టేష‌న్ ఫొటోల‌ను ఎంపీ గురువారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య ధామ్‌ డెకరేషన్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

గురువారం రాత్రి రంగు లైట్ల వెలుతురులో శోభాయమానంగా కనిపిస్తున్నది. అయోధ్య ధామ్ జంక్షన్ నాలుగు గోపురాల‌తో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది.  భవనం మధ్య గోపురం రాముడి కిరీటం ప్రేరణతో నిర్మించారు. కిరీటం వెనుక ఉన్న చక్రం సూర్యుడిని సూచిస్తుంది. శిఖరం మధ్య ఏడు మండపాలు ఉన్నాయి.

పైగా ఈ అయోధ్య ధామ్ జంక్షన్‌కు త‌క్కువ విద్యుత్తు అవసరమవుతుంది. ఎందుకంటే దీన్ని సమృద్ధిగా సహజ కాంతి ప‌డేలా డిజైన్ చేసి నిర్మించారు. నీటి సామర్థ్యం కోసం స్టేషన్‌లో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ సదుపాయం క‌ల్పించారు. ప్రధాన స్టేషన్ టెర్మినల్‌ను హైవే, టెంపుల్‌తో అనుసంధానించే మార్గం రామ మందిరానికి దారి తీస్తుంది.