జయప్రద అరెస్ట్ కు ప్రత్యేక పోలీస్ బృందం 

మాజీ ఎంపీ, నటి జయప్రదను జనవరి 10 లోపు కోర్టు ముందు హాజరు పరిచేందుకు రాంపూర్ పోలీసుల బృందం వివిధ ప్రాంతాల్లో దాడులు చేసింది. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండు కేసుల్లో కోర్టు విచారణకు జయప్రద గత కొన్నాళ్లుగా హాజరు కావడం లేదు. 
 
ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా ఆమె ఖాతరు చేయలేదు. దాంతో, కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులను విచారిస్తున్న కోర్టు మాజీ ఎంపీ, నటి జయప్రద కొన్నాళ్లుగా విచారణకు హాజరు కాకపోతుండడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జనవరి 10లోగా ఆమెను కోర్టులో హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఆమెను సంప్రదించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో, ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు జయప్రదకు సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కానీ, ఆమెను అరెస్ట్ చేయలేకపోయారు. జయప్రద 2019 లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. ఆమెపై స్వర్, కెమ్రీ పోలీస్ స్టేషన్లలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ ఏప్రిల్ 19న నూర్‌పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారన్నది ఆమెపై స్వర్‌ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఒక కేసు. రెండో కేసు కెమ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందినది. ఇందులో పిప్లియా మిశ్రా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఈ రెండు కేసుల్లోనూ పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఎంపీ- ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు (మేజిస్ట్రేట్ ట్రయల్)లో కొనసాగుతోంది. ఈ కేసుల్లో జయప్రద గత కొన్ని రోజులుగా కోర్టుకు హాజరు కావడం లేదు.  దీనిపై ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. జయప్రద ఆచూకీ కోసం ఢిల్లీ, ముంబైలోని పలు చోట్ల ప్రత్యేక పోలీసు బృందం దాడులు నిర్వహించినప్పటికీ విజయం సాధించలేకపోయింది.