విజ‌య‌కాంత్ మృతి ప‌ట్ల మోదీ, స్టాలిన్‌ సంతాపం

మిళ న‌టుడు, డీఎండీకే అధినేత విజ‌య‌కాంత్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న మ‌ర‌ణం బాధాక‌రం. త‌మిళ చల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌నో లెజెండ్. త‌న న‌ట‌న‌తో కోట్ల మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారని ప్రధాని తెలిపారు. 

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను విజ‌య‌కాంత్ ఎంతో ప్ర‌భావితం చేశారు. నాకు మంచి మిత్రుడు.. ఆయ‌న లేర‌నే విష‌యాన్ని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది. విజ‌య‌కాంత్ కుటుంబానికి, అభిమానుల‌కు, అనుచ‌రుల‌కు సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్లు ప్రధాని మోదీ  పేర్కొన్నారు.

కాగా, త‌మిళ న‌టుడు విజ‌యకాంత్ మృతి ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సినీ, రాజ‌కీయ రంగాల్లో విజ‌య‌కాంత్ విశేష సేవ‌లందించి, ల‌క్ష‌లాది మంది హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నార‌ని పేర్కొన్నారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అని రాహుల్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తమిళ స్టార్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ కు నివాళులర్పించారు. చెన్నైలోని విరుగంబాక్కంలోని నటుడి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి కెప్టెన్‌ భౌతికకాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్‌ వెల్లడించారు.

మంచి మనసున్న మిత్రుడు విజయ్ కాంత్ సినీ పరిశ్రమలోనూ ప్రజా జీవితంలోనూ తన కఠోరమైన శ్రమతో ఎన్నో విజయాలను అందుకుని ప్రజలపక్షాన నిలబడ్డారని స్టాలిన్ కొనియాడారు. నటుడుగా, నటీనటుల సంఘం అధ్యక్షుడిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా ఏ పని చేపట్టిన దానికే పూర్తిగా అంకితమై తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించారు నివాళులు అర్పించారు. 
 
కుటుంబ స్నేహితుడిగా తనకు సుపరిచితుడని స్టాలిన్ విజయకాంత్ గొప్పతనాన్ని స్మరించుకున్నారు. విజయ్ కాంత్ మృతి పట్ల నటి ఖుష్బూ సంతాపం వ్యక్తం చేశారు. విజయ్ కాంత్ మరణం చాలా బాధాకరమని పేర్కొన్న ఆమె ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన లేని లోటు తీర్చలేనిదని ఖుష్బూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
కాగా తమిళనాడు ప్రభుత్వం విజయ్ కాంత్ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. నేడు సంతాప దినంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో సినిమా షో లను రద్దు చేసింది.