39 రోజుల్లో 31 లక్షల మందికి అయ్యప్ప దర్శనం

కేరళలో అయ్యప్ప నెలవైన శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి శబరిగిరులు మొత్తం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. అంచనాలకు మించి వస్తున్న భక్తులతో అక్కడి పోలీసులు, దేవస్థానం అధికారులు కూడా వారిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.  అయితే ఈ ఏడాది అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన వారితో శబరిమల ఆదాయం రూ.200 కోట్లు దాటింది.
39 రోజుల క్రితం ప్రారంభమైన అయ్యప్ప దర్శనాల్లో భాగంగా ఇప్పటివరకు 31 లక్షల మంది శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది.  ఈసారి మండల విరక్కు సందర్భంగా అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ‌బ‌రిమ‌ల ఆలయ ఆదాయం రూ. 200 కోట్లు దాటినట్లు ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తాజాగా వెల్లడించారు.
గ‌త 39 రోజుల్లో రూ.204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది.  ఇందులో కానుకల రూపంలో రూ. 63.89 కోట్లు రాగా, అర‌వ‌న ప్ర‌సాదం ద్వారా రూ. 96.32 కోట్ల ఆదాయం ఆలయానికి వ‌చ్చిందని తెలిపింది. అయితే కానుక‌ల రూపంలో వ‌చ్చిన ఆదాయం లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్య‌క్షుడు పీఎస్ ప్ర‌శాంత్ వెల్లడించారు. 
 
లెక్కింపు ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయితే ఆదాయం మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. ఇక అప్పం ప్ర‌సాదం ద్వారా రూ. 12.38 కోట్లు వ‌చ్చిన‌ట్లు ప్ర‌శాంత్ తెలిపారు. ఈ మండ‌ల విరక్కు పూజ కాలంలో డిసెంబర్ 25 వ తేదీ నాటికి 39 రోజుల్లో 31,43,163 మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు వెల్లడించింది. 
 
ఆదివారం ఒక్కరోజే 1.12 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని తెలిపింది. ఇక ఇప్పటివరకు 7,25,049 మందికి ఉచిత భోజ‌నం పెట్టినట్లు తెలిపారు. ఇక బుధ‌వారం రాత్రి 11 గంటలకు ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది.  ఆ తర్వాత మ‌క‌ర‌విల‌క్కు పండుగ కోసం మ‌ళ్లీ డిసెంబ‌ర్ 30 వ తేదీన శబరిమల ఆల‌యాన్ని తెర‌వ‌నున్నట్లు స్పష్టం చేసింది. ఇక జ‌న‌వ‌రి 15వ తేదీ మకర జ్యోతి పూర్తయ్యే వరకు ఆల‌యాన్ని తెరిచి ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
మండ‌ల పూజ స‌మ‌యంలో డిసెంబ‌ర్ 25వ తేదీ నాటికి సుమారు 31,43,163 భ‌క్తులు ఆల‌యాన్ని సంద‌ర్శించారు. 7,25,049 మందికి ఉచిత భోజ‌నం పెట్టారు.  ఇక మకరవిళక్కు (జ్యోతి దర్శనం) వచ్చే నెల 15 వ తేదీన సాయంత్రం 6 గంటల 36 నిమిషాల 45 సెకన్లకు దర్శనం కలగనుంది. జ్యోతి దర్శనం పూర్తయిన తర్వాత శబరిమల సన్నిధానాన్ని వచ్చే నెల 20 వ తేదీన ఉదయం ఆరున్నర గంటలకు మూసివేయనున్నారు. ఆ తర్వాత భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించరు.