కీలకమైన తుది దశలో ప్రవేశించిన ఆదిత్య ఎల్ 1

సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన వ్యోమనౌక ఆదిత్య ఎల్ 1 కీలక దశలోకి ప్రవేశించింది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత తుది దశకు చేరుకుంది. భూమికీ, సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేంజ్ పాయింట్ లోకి ఈ నౌకను పంపడం ఇప్పుడు మిగిలి ఉంది.  అయితే, అంతకంటే ముందే దీని వృత్తాకార కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1ను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.
అత్యంత కీలకమైన ఈ ప్రక్రియకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అంతరిక్షంలోని శీతల శూన్యంలో 15 లక్షల కిలోమీటర్లకు పైగా సాగిన ఆదిత్య ఎల్ 1అంతరిక్ష నౌక తన ప్రయాణంలో చివరి దశలోకి చేరుకుంది.  ఇస్రో సెప్టెంబరు 2, 2023న శ్రీహరికోట నుంచి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. దీన్ని ఫైనల్ గా ఎల్ 1లోకి చొప్పించడం అనేది మిషన్ లో క్లిష్టమైన దశ. దీనికి ఖచ్చితమైన నావిగేషన్, నియంత్రణ అవసరం.
ఆదిత్య ఎల్ 1 కొత్త కక్ష్యలోకి వెళ్లే ముందు నాలుగు భూమి కక్ష్యల్లో తిరిగింది.  ఇప్పుడు హాలో కక్ష్యలోకి ఆదిత్య ఎల్ 1 ప్రవేశించాల్సి ఉంది. ఈ ప్రక్రియను చాలా క్లిష్టంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా అసలుకే ముప్పు తప్పదు. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీ వ్యూహంతో హాలో ఆర్బిట్ లోకి దీన్ని చొప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 
 
సౌర వాతావరణం, సౌర అయస్కాంత తుఫానులు, భూమిపై పర్యావరణం వాటి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్ 1ను పంపారు. ఆదిత్య ఎల్ 1ను హాలో కక్ష్యలోకి విజయవంతంగా చొప్పించడం కోసం ఇస్రో టీమ్ తప్పనిసరిగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతరిక్ష నౌక స్థానం, వేగాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. 
 
ప్రణాళికాబద్ధమైన మార్గం నుండి ఏదైనా వ్యత్యాసాలను ఎదుర్కోవడానికి ఆన్‌బోర్డ్ థ్రస్టర్‌లను ఉపయోగించి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వీటికి అదనంగా విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వెల్క్), సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్)తో సహా స్పేస్‌క్రాఫ్ట్ సాధనాలు సూర్యుడు విడుదల చేసే తీవ్రమైన రేడియేషన్, కణాల నుండి తప్పనిసరిగా రక్షణ పొందాలి.