అన్నదాతలపై నోరుపారేసుకున్న కర్ణాటక మంత్రి

పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గతంలో వ్యాఖ్యానించిన కర్ణాటక చెరకు, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మంత్రి శివానంద్‌ పాటిల్‌ తాజాగా మరోసారి అన్నదాతలపై నోరుపారేసుకున్నారు. రుణమాఫీ కోసం పదేపదే కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారంటూ మాట్లాడారు. కరువు రావాలనేది వారి కోరికని, తద్వారా ప్రభుత్వాన్ని తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేయొచ్చనేది వారి అలోచన అని ఎద్దేవా చేశారు. బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శివానంద్‌ పాటిల్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రైతులకు కృష్ణా నది నీళ్లు, కరెంట్‌ ఉచితంగా లభిస్తున్నా ఒకే కోరిక ఉన్నది. ప్రతిసారి కరువు రావాలని వారు కోరుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వాన్ని రుణమాఫీ డిమాండ్‌ చేయవచ్చన్నది వారి ఆలోచన’ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. 

మంత్రి శివానంద్‌ పాటిల్‌ రైతులపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచిన తర్వాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని వ్యాఖ్యానించారు. మంత్రి శివానంద్‌ పాటిల్‌ తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. 

ఆయన చేత రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్‌ చేశాయి. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడుతూ మంత్రివర్గంలో తెలివితక్కువ వారే ఎక్కువగా ఉన్నారంటూ రాష్ట్ర బిజెపి ధ్వజమెత్తింది.  అన్నదాతలను పదేపదే అవమానించడం, రైతులను కించపరచడం కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతిగా మారిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు. 

మంత్రి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. రైతులకు ఏమిచ్చినా అది రాష్ర్టాభివృద్ధికే తప్ప భిక్ష కాదని హితవు పలికారు. ‘రైతులు ఆత్మగౌరవం ఉన్నవారు. పరిహారం కోసం వారు ఆశపడరు’ అని స్పష్టం చేశారు.

మంత్రి శివానంద్‌ పాటిల్‌ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. అన్నదాతల కష్టాలు, నష్టాలను కించపరిచేలా మాట్లాడం కాంగ్రెస్‌ నేతలకు తగదని హెచ్చరించారు. మంత్రులు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికారు. రైతులు తమ హక్కులనే అడుగుతారు తప్ప బిక్ష కాదని స్పష్టం చేశారు.

రైతులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కరువు రావాలని కోరుకోరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. కర్ణాటక మంత్రి శివానంద్‌ పాటిల్‌ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ మంత్రి వ్యాఖ్యల వీడియోను సోమవారం తన ఎక్స్‌ ఖాతాలో ట్యాగ్‌ చేస్తూ. ‘రైతుల గురించి ఇంత చులకనగా మాట్లాడే వాళ్లు మంత్రులు ఎలా అయ్యారు?’ అంటూ ప్రశ్నించారు. `రైతులెవరూ కరువు రావాలని కోరుకోరు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వమే వచ్చి తమకు సాయం చేయాలని ఎదురు చూడరు’ అని పేర్కొన్నారు.