ఐదేళ్లలో దేశంలో 140 ప్రైవేటు యూనివర్సిటీలు

గత అయిదేళ్ల కాలంలో దేశంలో మొత్తం 140 ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో అత్యధికంగా గుజరాత్‌లో ఏర్పాటయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర విద్యా శాఖ గణాంకాలను బట్టి ఈ వివరాలు తెలుస్తున్నాయి.  ఈ గణాంకాలను బట్టి గత అయిదేళ్ల కాలంలో గుజరాత్‌లో 28 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కాగా మహారాష్ట్రలో15 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి.అదే సమయంలో మధ్య ప్రదేశ్‌లో 14, కర్నాటకలో 10 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. 

సంబంధిత రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన చట్టం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి’ అని విద్యా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చట్టం, యూనివర్సిటీ నోటిఫికేషన్ కాపీలు అందిన తర్వాత 1956 నాటి యుజిసి చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం యుజిసి యూనివర్సిటీల జాబితాలో ప్రైవేటు యూనివర్సిటీ పేరును చేర్చడం జరుగుతుందని ఆ అధికారి తెలిపారు.

అలా జాబితాలో చేర్చిన ప్రైవేటు యూనివర్సిటీలు యూజీసీ నుంచి నిర్దేశించిన ఆమోదం లేకుండానే జనరల్ డిగ్రీలను ఇవ్వడానికి అధికారం కలిగి ఉంటాయని ఆ అధికారి తెలిపారు. అయితే ప్రొఫెషనల్, మెడికల్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడానికి సంబంధిత రేగ్యులేటరీ లేదా చట్టబద్ధ సంస్థల అనుమతి అవసరమని స్పష్టం చేశారు. 

అలాంటి ప్రోగ్రామ్‌లు అలిండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుందని కూడా ఆ అధికారి తెలిపారు. కాగా గత అయిదేళ్ల కాలంలో చత్తీస్‌గఢ్‌లో ఏడు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయగా, జార్ఖండ్, రాజస్థాన్‌లలో చెరి ఆరు వర్సిటీలు ఏర్పాటయ్యాయి. 

బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, తెలంగాణలలో ఒక్కో రాష్ట్రంలో అయిదేసి, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మణిపూర్ ఒడిశా, తమిళనాడు, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లలోనాలుగేసి చొప్పున ఏర్పాటయ్యాయి. కాగా 2018 19 విద్యాసంవత్సరంలో 40 ప్రైవేటు వర్సిటీలు ఏర్పాటు కాగా, 2021 22విద్యాసంవత్సరంలో 34 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి.