కాకతీయలో ర్యాగింగ్… 81 మంది విద్యార్థినుల‌ సస్పెన్షన్

కాకతీయ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా తరచూ ర్యాగింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుండగా తాజాగా జూనియర్లను వేధింపులకు గురి చేస్తున్నారన్న కారణంతో వర్సిటీ అధికారులు 81 మంది సీనియర్ విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు వేశారు.
 
యూనివర్సిటీలోని ఐదు లేడీస్ హాస్టళ్లలో వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన దాదాపు రెండు వేల మంది వరకు ఉంటున్నారు.  కొద్దిరోజులుగా జూనియర్ విద్యార్థినులను సీనియర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. పరిచయ కార్యక్రమం పేరుతో మొదలుపెట్టి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వెకిలి చేష్టలకు పాల్పడుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొన్న కొందరు విద్యార్థినులు ఈ నెల 18న వర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
తమను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయంతో పాటు సీనియర్ల చేష్టల గురించి వారికి వివరించారు. జూనియర్ విద్యార్థినుల ఫిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు హాస్టళ్లతో పాటు డిపార్ట్మెంట్లలో విచారణ జరిపారు. ఒక్కో డిపార్ట్మెంట్ తో పాటు ఒక్కో హాస్టల్ లో ఎంక్వయిరీ చేశారు. ఇందులో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన విద్యార్థినులు కొద్దిరోజులుగా జూనియర్లను పరిచయ కార్యక్రమం పేరున వేధిస్తున్నట్టు తేలింది. 
 
దీంతో అధికారులు హాస్టల్స్, డిపార్ట్మెంట్లలో ర్యాగింగ్ అంశంపై సమగ్ర నివేదికను రిజిస్ట్రార్ శ్రీనివాసరావు కు అందజేశారు. ఆ నివేదికల ఆధారంగా మొత్తం 81 మంది విద్యార్థులపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఒక్కసారిగా 81 మందిపై వేటు పడటంతో కాకతీయ యూనివర్సిటీలో కలకలం మొదలైంది. 
వాస్తవానికి యూనివర్సిటీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేయూ అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోనే ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.