పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైళ్ళు

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యమైన పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ ప్రజలను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఈ రైళ్లకు క్రేజ్ పెరగడంతో రైల్వే శాఖ వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 35 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ వందేభారత్ రైళ్లలో ప్రధాన లోపం స్లీపర్ కోచ్ లు లేకపోవడం.తాజాగా కేంద్ర ప్రభుత్వం స్లీపర్ కోచ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.వీటిని ఇప్పటికే ఆధునాతనంగా తీర్చిదిద్దిన రైల్వే శాఖ త్వరలోనే మరిన్ని హంగులతో పట్టాలెక్కించనుంది.

కాగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధం కాగా విజయవాడ డివిజన్ కు రెండు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ మేరకు త్వరలోనే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించినప్పటికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ యోచిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన వందే భారత్ రైళ్లు దివ్యాంగులకు అనుకూలంగా లేకపోవడంతో త్వరలోనే ప్రవేశపెట్టబోయే స్లీపర్ బోగీల రైళ్లను ప్రత్యేక డిజైన్ తో తయారు చేశారు. మొత్తం 857 బెర్తుల్లో 37 బెర్తులు సిబ్బందికి, ఒక ప్యాంట్రీ కార్ ఉంటాయి.

రాత్రికి రాత్రి దూరప్రయాణాలు చేసే ప్రయాణికులకు ఈ వందేభారత్ స్పీపర్ కోచ్‌లలో ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది.ప్రగతి, స్వయం సమృద్ధి భారత్‌కు సంకేతంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే ఈ సెమీ లైట్ స్పీడ్ ట్రైన్లలో జర్నీ చేయడం ప్రయాణికులకు సరికొత్త అనునుభూతిని కలిగిస్తోంది. ఇక 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడిచే తొలి వందేభారత్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ‘మేక్ ఇండియా’ ఇనేషియేటివ్ కింద చెన్నైలోని ఇండిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటిచెప్పింది.