శివాలయ పూజారిని కిరాతకంగా కాల్చిచంపిన దుండగులు

 
* బీహార్ లో అత్యంత పాశవిక ఘటన
 
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దనపూర్ గ్రామంలో ఒక ఆలయ పూజారిని అత్యంత పాశవికంగా దుండగులు కాల్చిచంపారు. కళ్లు పెరికేసి, మర్మావయాలు కోసేసి మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశారు. శనివారంనాడు ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు రెచ్చిపోయారు.  పోలీసులపై రాళ్లదాడికి దిగడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీంతో గోపాల్‌గంజ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
సంఘటన వివరాల ప్రకారం, దనపూర్ జిల్లాలోని శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న 32 ఏళ్ల మనోజ్ కుమార్ గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయాడు.  సోమవారం మధ్య రాత్రి తర్వాత గుడి నుంచి బయటకు వెళ్లిన ఆయన అదృశ్యమయ్యాడు. బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షుడైన అశోక్‌ కుమార్ షా తన సోదరుడు మనోజ్‌ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆలయానికి వెళ్లిన మనోజ్ కుమార్ కనపడకుండా పోవడంతో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది.  కాగా, శనివారం గ్రామ శివారులోని చెట్లపొదల్లో పూజారి మనోజ్‌ కుమార్‌ మృతదేహం కనిపించింది. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. అలాగే కనుగుడ్లు పెకలించి ఉన్నాయి. నాలుక, ప్రైవేట్‌ భాగం వద్ద కోసిన గాయాలున్నాయి. 
 
ఈ విషయం తెలుస్తున్న గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసనకు దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఒక పోలీస్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
విషయం తెలిసిన గోపాల్‌గంజ్ సదర్ సబ్-డివిజనల్ పోలీసు అధికారి ప్రాంజల్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. 
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, తగినన్ని పోలీసు బలగాలను మోహరించామని చెప్పారు.  హత్యా ఘటనపై విచారణ జరుపుతున్నామని, పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.
కాగా, తన సోదరుడు ఎక్కడికో వెళ్లి ఉంటాడని, తిరిగి వస్తాడని అనుకున్నామని, ఇంత దారుణంగా హత్యకు గురవుతాడని అనుకోలేదని అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.  పోలీసులు ఫిర్యాదు చేసిన ఆరు రోజుల తర్వాత తన సోదరుడి మృతదేహం కనిపించిందని, ఎందుకు ఆయన చంపాల్సి వచ్చిందో, చంపినదెవరో ఇంతవరకూ తెలియలేదని పేర్కొన్నారు. పూజారి హత్య ఘటన, అనంతరం జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.