మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా హతం
మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడకం హిడ్మా అలియాస్‌ చైతు ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే హిడ్మా మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.
 
ఇదిలావుండగా, పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చినపోయాడంటూ గతంలోనూ అనేక వార్తలు వచ్చాయి. ఎన్ కౌంటర్‌లో చనిపోయాడంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా పోలీసులకే సవాల్ విసురుతూ వచ్చాడు. దీంతో ప్రస్తుతం హిడ్మా మృతిపై అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాలాఘాట్ జిల్లా ఖామ్‌కోదాదర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు తిష్ట వేసినట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన హాక్ ఫోర్స్ సిబ్బందికి పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడ పోలీసులను మోహరించారు. పోలీసులు రావడాన్ని గమనించిన మావోలు ఎదురుకాల్పులు చేశారు. 
 
పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పులులో చివరకు హిడ్మా మృతి చెందాడు. అలాగే ఇద్దరు మహిళలతో పాటూ మరో నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లా మిర్తుర్‌కు చెందిన హిడ్మా (40) కేవలం 7వ తరగతి వరకూ మాత్రమే చదివాడు.
ఇతడు 17 ఏళ్ల వయసులో 1996లో మావోయిస్టు పార్టీలో చేరాడు. తర్వాత క్రమక్రమంగా ఎదుగుతూ చివరకు మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశాడు.
అలాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలోనూ పని చేశాడు. అలా వివిధ విభాగంలో పని చేస్తూ పట్టు పెంచుకున్నాడు.  దళాలను నడిపించడంలో, తుపాకీ పేల్చడంలో హిడ్మా నేర్పరి కావడంతో ఎన్నోసార్లు ఎన్‌కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. అనేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించి అనేక మంది పోలీసులు హతమవ్వడానికి ప్రధాన కారణమయ్యాడు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు. 
 
దీంతో అప్పటి నుంచి ఇతడి కోసం పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. ఇలా మొత్తం మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాలకు కొరకనాకి కొయ్యగా మారాడు. ఇతడిపై రూ.14 లక్షల రివార్డు కూడా ఉంది. మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసాల్లో హిడ్మానే ప్రధాన భూమిక పోషించినట్లు తెలిసింది.  హిడ్మా టార్గెట్ చేస్తే పక్కాగా ఉంటుందని అంటారు. అతడి ఆపరేషన్లలో అనేక మంది పోలీసుల దుర్మరణం చెందారు.
అయితే, హిడ్మా ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా చూడలేదు. బయట ప్రపంచానికి కనిపించిందీ లేదు. దాదాపు 40 ఏళ్ల ఉంటాయని, బక్కపలచని దేహంతో చాలా మృదువుగా మాట్లాడుతాడని అతడి గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు. దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో ఉంటూ మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసాలకు రూపకల్పన చేసేది హిడ్మానే అని పోలీసుల విచారణలో తేలింది.