భ‌ద్ర‌తా వైఫ‌ల్యం నాదే … స‌మ‌గ్ర విచార‌ణ చేస్తున్నాం

లోక్ స‌భ‌లో నేడు దాడి జ‌ర‌గ‌డం ప‌ట్ల స్పీక‌ర్ ఓం బిర్లా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిండు స‌భ‌లో జ‌రిగిన దాడి పూర్తిగాభ‌ద్ర‌తా వైఫ‌ల్యంగా భావిస్తున్నామ‌ని, దానికి తానే బాధ్య‌త వ‌హిస్తాన‌ని తెలిపారు. దాడి అనంత‌రం తిరిగి ప్రారంభ‌మైన లోక్ స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై స‌భ్యులు ప్ర‌శ్న‌ల వర్షం కురిపించారు. దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు.

దీనిని ఆయ‌న స‌మాధానం చెబుతూ, ”లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని చెప్పారు.

అయితే, నిందితులు వదిలిన గ్యాస్‌ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతామని బిర్లా ప్రకటించారు. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్‌ స్పష్టం చేశారు.

కాగా, ఈ న‌లుగురు సిఫార్స్ లేఖ‌లు పొందిన ఆ ఎంపిని కూడా అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై స‌మ‌గ్ర ప్ర‌కట‌న త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. ఈ ఇద్ద‌రు నిందితులు దాడి చేసిన స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు మ‌ధ్య ప్ర‌దేశ్, చ‌త్తీస్ గ‌డ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. దాడి విష‌యం తెలిసిన వెంట‌నే ప్ర‌ధాని హోం కార్య‌ద‌ర్శికి, పార్ల‌మెంట్ భ‌ద్ర‌తా ద‌ళం చీఫ్ కు ఫోన్ వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.