దుబాయ్ పోలీసులు అదుపులో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమాని

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీసు ఆధారంగా అతనిని దుబాయ్   పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి. 

గతవారం రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నారని, త్వరలో అతనిని భారతదేశానికి పంపే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. మరో యజమాని సౌరభ్‌ చంద్రఖర్‌ కోసం కూడా దుబాయ్  పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. రోజుకు రూ.200 కోట్ల లాభాన్ని ఆర్జించిన మహాదేవ్‌ యాప్‌ ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

ఈ యాప్‌ ప్రమోటర్లు అప్పటి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లించారని క్యాష్‌ కొరియర్‌ అసిమ్‌ దాస్‌ పేర్కొన్నట్లు ఈడి ఆరోపించింది. అయితే కొరియర్‌ కుట్రలో భాగంగా తనను ఇరికించారని, తాను ఎవరికీ నగదు చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. విచారణలో రవి ఉప్పల్‌ పసిఫిక్‌ మహాసముద్రంలోని వనౌటు అనే దేశానికి చెందిన పాస్‌పోర్ట్‌తో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, అయితే భారత దేశ పౌరసత్వాన్ని వదులుకోలేదని తేలింది. అలాగే ఈ పాస్‌పోర్ట్‌ సాయతో ఆస్ట్రేలియన్‌ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు ఈడి తెలిపింది.  

ఈ యాప్‌ మరో ప్రమోటర్‌ అయిన సౌరభ్‌ చంద్రశేఖర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో  రూ. 200 కోట్లతో జరిగిందని,  పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరైనట్లు ఈడి తన చార్జిషీటులో పేర్కొంది.  ఈ కేసులో రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌పై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో పాటు ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రూ. 6000 కోట్ల వ‌ర‌కూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. ఫ్రాంచైజీలు, బ్రాంచ్‌లు, నెట్‌వ‌ర్క్ ద్వారా యాప్ పేరుతో నిందితులు రోజుకు రూ. 200 కోట్లు దండుకున్న‌ట్టు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లోని రాయ్‌పూర్ కోర్టులో స్పెష‌ల్ పీఎంఎల్ఏ కోర్టులో దాఖ‌లైన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.