సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటించారు. సోమవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జమ్ము – కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని భారత్ ప్రజలందరు కలలుగన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మరో విజయంగా జనసేన భావిస్తోంది” అని చెప్పారు.
దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొనే మధుర క్షణాలు ఇవని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సమర్థిస్తుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల జనసేన హర్షాతిరేకం వ్యక్తం చేస్తోందని చెప్పారు. సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా ఈ రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ధ్రువీకరించిందని తెలిపారు. 
 
ఈ నిర్ణయం దేశ సమగ్ర ఐక్యత, పురోగతికి ఒక ముఖ్యమైన పరిణామం అంటూ అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ సాధించిన విజయంగా దీనిని జనసేన పరిగణిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
 
పవన్ ను కిషన్ రెడ్డి ఏదో అన్నట్లు దుష్ప్రచారం
 
ఇలా ఉండగా, సోషల్ మీడియాలో తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ను ఏదో అన్నట్లు జరిగిన దుష్ప్రచారంను కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్‌పై తానేమీ అనలేదని, ఏవరో ఎవరో ఏదో రాసి పెడితే ఎలా? అంటూ ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. జనసేన ఎన్డీయేలో భాగస్వామి పార్టీ అని చెబుతూ రెండు పార్టీలు కలిసే తెలంగాణ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.