శబరిమలపై కేరళ ప్రభుత్వ సహాయ నిరాకరణ

శబరిమల భక్తులకు తగు సదుపాయాలు కల్పించడంలో  కేరళలోని సీపీఎం ప్రభుత్వం సహాయ నిరాకరణ  చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు సీపీఎం ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదని ఆయన హితవు చెప్పారు.  శబరిమలలో పూర్తి స్థాయిలో భక్తులు ఇంకా చేరుకోకముందే పరిస్థితులు, ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉన్నాయని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై కేరళ ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.  అయ్యప్పస్వామి భక్తులకు మౌలికవసతులు కల్పించడం, తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కేరళ ముఖ్యమంత్రిని  కోరారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు.
భక్తులు కూడా సంయమనంతో ఉండాలని, సహకరించాలని కిషన్ రెడ్డి అభ్యర్థించారు. కేరళ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై కేరళ ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టు ఆయన తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన భద్రతా సిబ్బంది, మౌలిక వసతులు, కనీస ఏర్పాట్లు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 
 
కేంద్ర ప్రభుత్వం తరపున ప్రసాద్ పథకం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి ఆరోపించారు.  కేరళ ప్రభుత్వం ఏ సహాయం కోరినా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్లను కూడా నడుపుతున్నామని చెబుతూ  భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు.