ఒక వ్యక్తి కి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసి, మరో నాలుగు నెలల్లో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారి వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు  తిరిగి ఏపీకి వచ్చి ఇక్కడా ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యవహారంపై ఎన్నికల కమిషన్ కు పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇటువంటి ఫిర్యాదులకు స్పందిస్తూ ఒక వ్యక్తి కి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎం కె మీనా తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక చోటకు మించి ఓటు ఉండటం నేరమని పేర్కొంటూ  ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలని, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు.

వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలని, తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. తప్పుడు డిక్లరేషన్ తో ఓటు నమోదు ధరఖాస్తు చేస్తే జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా ధరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్కులు ఇవ్వాలని సూచించారు.

ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు ముఖేష్ కుమార్ మీనా. ఇళ్లు మారే వాళ్లు ఓటు కి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలని, తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇలా ఉండగా,  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు తావిచ్చినట్లు అవుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కు లేఖ వ్రాసారు. 

ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని ఆయన తెలిపారు.  మాన్యువల్ ప్రకారం జనాభా పరమైన సారూప్య ఎంపికలు, ఫోటో గ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీలో ఓట్ల తొలగింపుతో పాటు కొత్త ఓట్ల నమోదుపైనా టీడీపీ, వైసీపీ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.