దేశంలో 55 లక్షల అక్రమ మొబైల్‌ కనెక్షన్లు

* 1.31 లక్షల సిమ్‌లతో సైబర్‌, ఆర్థిక నేరాలు

గతంలో సిమ్‌ నిబంధనలు కఠినంగా లేని సమయంలో సిమ్‌ ఏజెన్సీల్లో విచ్చలవిడిగా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్స్‌ అమ్మేవారు. ఒక వ్యక్తి డాక్యుమెంట్లు సమర్పిస్ అతడికి తెలియకుండా పదుల సంఖ్యలో సిమ్ములు యాక్టివేట్‌ చేసి మోసగాళ్లకు ఇచ్చేవారు. వారు వాటిని సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలతోపాటు ఇతర నేరాల్లో ఉపయోగించేవారు. 

ఫలితంగా అమాయకులు పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనుమానాస్పద మొబైల్‌ కనెక్షన్లను కేంద్ర టెలికం శాఖ గుర్తించి, వాటిని తొలగిస్తున్నది. ఆ వివరాలను తాజాగా పార్లమెంట్‌కు వెల్లడించింది. దీని ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన అనుమానాస్పద ఫోన్‌ నంబర్లు 67 లక్షలు. 

వీటన్నింటినీ పరిశీలించి 55.52 లక్షల అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు నిర్ధారించారు. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో వీటిని తీసుకున్నట్లు తేల్చారు. మొత్తం 70 వేల సిమ్‌ విక్రయ ఏజెన్సీలు ఈ ఫేక్‌ సిమ్స్‌ రాకెట్‌లో భాగస్వామి అని గుర్తించారు. ఆ ఏజెన్సీలపై నిషేధం విధించారు. నకిలీ డాక్యుమెంట్లతో సిమ్‌లు తీసుకున్నవారిలో కొందరు తమ వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తే, మరికొందరు సైబర్‌, ఆర్థిక నేరాల కోసం వినియోగించారు. ఇలా 2.78 లక్షల సిమ్‌ కార్డులను నేరాల కోసం వినియోగించినట్టు వారు గుర్తించారు. వాటన్నింటినీ బ్లాక్‌ చేయించారు. 

మొత్తం 1,31,961 మొబైల్‌ ఫోన్లలో ఈ సిమ్ములను వాడినట్టు తేల్చి, వాటిని రద్దు చేశారు. ఈ సిమ్‌ కార్డులు అమ్మిన 1,890 మంది సిమ్‌ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. మరోవైపు స్పూఫ్‌ కాల్స్‌పైనా దృష్టిసారించినట్టు కేంద్రం తెలిపింది.

ఇలాంటివాటిని గుర్తించి, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నట్టు వెల్లడించింది. గత మూడేండ్లలో 65 ఏజెన్సీలపై కేసులు నమోదు చేసినట్టు వివరించింది. మన పేరు మీద మనం వినియోగించే సిమ్‌ కార్డులు తప్ప ఇంకా ఏవైనా ఉన్నాయేమో చెక్‌ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

సంచార్‌ సాథి పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. www.sancharsaathi.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లి మొబైల్‌ కనెక్షన్‌ ఇన్‌ యువర్‌ నేమ్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. తర్వాత మన ఫోన్‌ నంబర్‌, ఓటీపీతో లాగిన్‌ అయితే మన ఆధార్‌ నంబర్‌తో ప్రస్తుతం ఎన్ని సిమ్‌కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయో చూపిస్తుంది.

అందులో ఉన్న నంబర్లు మీవి కాకపోతే ‘నాట్‌ మై నంబర్‌’ అనే ఆప్షన్‌ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చు. వినియోగించని నంబర్లు ఉంటే ‘నాట్‌ రిక్వైర్డ్‌’ ఆప్షన్‌ ఇచ్చి సర్వీస్‌ను రద్దు చేసుకోవచ్చు.