ఉల్లి గడ్డల ఎగుమతులపై నిషేధం

దేశీయ లభ్యతను పెంచి, ధరలను నియంత్రించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2024 మార్చి వరకు ఉల్లి ఎగుమతి విధానాన్ని సవరించినట్లు విదేశీ వర్తక డైరెక్టరేట్ జనరల్(డిజిఎఫ్‌టి) శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు.  ఢిల్లీలో స్థానిక వ్యాపారులు ఉల్లిని కిలో రూ. 70 నుంచి రూ. 80 మధ్య విక్రయిస్తున్నారు.

కాగా..దేశంలో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో నిల్వలో ఉంచిని ఉల్లిని రిటేల్ మార్కెట్‌కు తరలించి కిలో రూ. 25 వంతున విక్రయించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉల్లి ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఇదివరకు అనేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై కనీస ఎగుమతి ధర(ఎంఇపి)ను టన్నుకు 800 డాలర్లుగా విధించింది. 

డిసెంబర్ 31 వరకు ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే అభ్యర్థనలకు ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకు ఉల్లి ఎగుమతిని నుమతిస్తామని డిజిఎఫ్‌టి తెలిపింది. 

తాజా నోటిఫికేషన్ వెలువడడానికి ముందే విదేశాలకు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న ఉల్లిని అనుమతించనున్నట్లు తెలిపింది. మరో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమలను అక్రమంగా పెద్ద మొత్తంలో నిల్వ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హోల్ సేల్ ట్రేడర్డు, రిటైల్ ట్రేడర్లు, ఇతర సంబంధిత సంస్థలు గోధుమలను నిల్వ చేసే విషయంలో గతంలో ఉన్న పరిమితులను సవరించారు. 

ఈ నూతన పరిమితులు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయి. కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెరిగేలా చూడడాన్ని నిరోధించడం కోసమే నూతన పరిమితులు విధించామని ఆహార శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. నవంబర్ నెలలో ఉల్లి ధర 58% పెరిగింది. దిగుబడి తగ్గడంతో పాటు పండుగ సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు, గోధుమల ధర కూడా అక్టోబర్ నెలలో గత 8 నెలల గరిష్టానికి చేరింది.