ఏపీ ప్రభుత్వం సహకారం లేకనే రైల్వే జోన్ లో జాప్యం

ఏపీ విభజన హామీల్లో ఒకటైన వైజాగ్ రైల్వే జోన్ పై ఓ అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి పడుతున్న పరిస్ధితి. విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా రైల్వే జోన్ హామీ మాత్రం అమలు కాలేదు. దీనిపై మరోసారి పార్లమెంటులో ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ  సమాధానం ఇస్తూ ఏపీ ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లే వైజాగ్ రైల్వే జోన్ ఆలస్యమవుతోందంటూ స్పష్టం చేశారు. అలాగే ఇప్పటివరకూ తామేం చేశామో కూడా చెప్పుకొచ్చారు.
 
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్లే వైజాగ్ రైల్వే జోన్ పై ముందడుగు పడటం లేదని రైల్వే మంత్రి చెప్పారు.  వైజాగ్ రైల్వే జోన్ పై శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. 
 
ఇందులో ఆయన.. రైల్వే జోన్ డీపీఆర్ తయారైందని, రూ. 106.89 కోట్లతో జోనల్ కార్యాలయం నిర్మాణ పనులు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.10 కోట్లు కేటాయింపులు కూడా చేశామని చెప్పారు. భూమి సర్వేతో పాటు జోనల్ కార్యాలయం కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాల లేఅవుట్ ప్లాన్ తయారీ బాధ్యత తూర్పు కోస్తా రైల్వే జోన్ కు అప్పగించామని వివరించారు.

 
వైజాగ్ ముదసర్లోవ లో 52.2 ఎకరాల భూమిలో వైజాగ్ రైల్వే జోనల్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. గతంలో బీఆర్టీఎస్ కోసం ఏపీ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకుందని, దానికి ప్రతిగా ఈ 52 ఎకరాలు కేటాయించాలని కోరామని పేర్కొన్నారు. జీవీఎంసీ దీన్ని తమకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు భూమిని గుర్తించి అప్పగించడంలో ఆలస్యం వల్లే రైల్వే జోన్ ఆలస్యం అవుతోందంటూ రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు.