పార్టీలు ఆనాసక్తితో ‘ఇండియా’ భేటీ వాయిదా

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ర్టాల ఫలితాలతో ‘ఇండియా’ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కూటమికి పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌  ఉత్తరాదిలో నాలుగు రాష్ర్టాలలో ఘోర పరాజయం పాలుకావడం దీనిపై ప్రభావం చూపింది. ఫలితంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఇంట్లో బుధవారం జరగాల్సిన కూటమి భేటీ వాయిదా పడింది. 
 
ఈ సమావేశానికి హాజరు కావడానికి కూటమిలోని పార్టీలు పెద్దగా ఆసక్తి కనబర్చకపోగా వివిధ కారణాల దృష్ట్యా తాము హాజరు కాలేమని సమాచారం పంపించాయి.  పైగా, ఆప్, ఎస్పీ అసలు స్పందించని లేదు. దీంతో కూటమి భేటీని ఈ నెల మూడో వారానికి వాయిదా వేసినట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ రోజు రోజుకూ పడిపోతుండటంతో ఆ పార్టీ నాయకత్వంలోని `ఇండియా’ కూటమితో కలిసి నడవడానికి విపక్షాలు ఆసక్తి కనబర్చడం లేదని స్పష్టం అవుతుంది.
అయితే అలాంటిదేమీ లేదని కాంగ్రెస్‌ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. వివిధ కారణాల వల్ల కూటమి నేతలు ఈ భేటీకి హాజరు కావడం లేదని సమాచారం ఇవ్వడంతో వారిని సంప్రందించి ఈ నెల 27 లేక 28న భేటీ కానున్నట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తెలిపారు.  తుఫాను బీభత్సం వల్ల రాలేనని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెప్పిన కారణం ఒక్కటే విపక్ష నేతలు చెప్పిన కారణాల్లో నమ్మశక్యంగా ఉన్నట్టు సమాచారం.
మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌- సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భేటీకి హాజరు కావడానికి ఆసక్తి కనబర్చడం లేదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.  అయితే ఇటీవల జరిగిన అయిదు రాష్ర్టాల ఎన్నికల కారణంగా కూటమి సమావేశాన్ని గత మూడు నెలలుగా నిర్వహించలేకపోయినట్టు కాంగ్రెస్‌ చెప్తున్నది.
ఈ ఐదు రాష్ర్టాలో విజయం సాధించి కూటమిపై పెత్తనం చెలాయించాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. అయితే ఆ పార్టీ అంచనాలు తలకిందులు కావడంతో కూటమిపై కాంగ్రెస్ ఆధిపత్యం ప్రశ్నార్ధకంగా మారింది.  కాంగ్రెస్ అహంకార ధోరణి కారణంగానే మూడు రాస్త్రాలలో ఓటమి చెందినాలంటూ టిఎంసి, శివసేన (ఉద్ధవ్), ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు బహిరంగంగానే విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ తో కలిసి `ఇండియా’ కూటమి ఏర్పాటుకు మొదట్లో చొరవ చూపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహితం ఇప్పుడు అనాసక్తి చూపుతున్నారు.