చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు తిరస్కరణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైలులో ఉండగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో విచారణ చేయాలని సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్‌పై ఉన్నందున వారెంట్లు నిరర్ధకమవుతాయంటూ వాటిని తోసిపుచ్చింది.

చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలెప్‌మెంట్, ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం అంశాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐడీ వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేసింది. అయితే ఈలోపు చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఈ పీటీ వారెంట్లను తోసిపుచ్చింది.

చంద్రబాబుకు ప్రస్తుతానికి స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. మిగిలిన ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం అంశాల్లో బెయిల్ రావాల్సి ఉంది. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కేసుల్లో బెయిల్ అంశం ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో చంద్రబాబుకు ఈ రెండు కేసుల్లో తిరిగి అరెస్టు చేసి రిమాండ్ లో విచారణ కోరాల్సిన పరిస్దితి సీఐడీకి ఎదురవుతోంది.

మరోవైపు చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆయన మళ్లీ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ముందుగా చంద్రబాబు ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 10న కేంద్ర ఎన్నికల కమిషన్ చెందిన బృందం రాష్ట్రానికి రానుంది. రాష్ట్రానికి వచ్చే ముందే ఢిల్లీ వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల గురువారం ఢిల్లీకి చంద్రబాబు పయనం వెళ్లనున్నారు.
 
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ 13గా ఉన్న చంద్రకాంత్‌ను సీఐడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. అప్రూవర్‌గా మారుతున్నట్టు చంద్రకాంత్ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. జనవరి 5వ తేదీన చంద్రకాంత్ స్టేట్‌మెంట్‌‌ను ఏసీబీ కోర్టు రికార్డు చేయనున్నది.