కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్, తీవ్ర తుపానుగా మిచౌంగ్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుపాను కదులుతున్నట్లు పేర్కొంది. గంటకు 8 కి.మీ వేగంతో తుపాను కదులుందని, ప్రస్తుతానికి చెన్నైకి 90 కి.మీ, నెల్లూరుకు 170 కి.మీ, బాపట్లకు 300 కి.మీ, మచిలీపట్నానికి 320కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
 
మంగళవారం ఉదయం నెల్లూరు- మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుపానుగా మిచౌంగ్ తీరం దాటనుందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో నేడు,రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
 
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ డా. బి.ఆర్ అంబేడ్కర్ సూచించారు. 
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. దీంతో ఇప్పటికే తీరప్రాంత జిల్లాల్లో రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
 
తుపాను ప్రభావంపై 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు.  ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని, వీరంతా జిల్లా యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని చెబుతూ  కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు.
 
కోస్తాంధ్ర తీరప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.  తుపాను ప్రభావంలో పలు విమాన సర్వీసులు సైతం రద్దు చేశారు. పలు రైళ్లు కూడా రద్దైయ్యాయి.
కాకినాడు జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు మీదుగా రాకపోకలు నిలిపివేశారు. ప్రభుత్వ పాఠశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు చేశారు. తాత్కాలికంగా రైళ్లను దారి మళ్లించారు. రైలు ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.