నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచాంగ్

నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. మిచాంగ్ తుఫాన్ గంటకు 14 కిలో మీటర్ల వేగంతో కదులుతుంది. చెన్నైకు 130 కిలో మీటర్ల దూరం, నెల్లూరుకు 220 కిలో మీటర్ల, బాపట్లకు 330 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాను పయనించనుంది.
మంగళవారం మధ్యాహ్నం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీరం దాటనుంది. నేడు, రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి.  తుపాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. ఇప్పటికే కోతలు కోసి పనల మీద ఉన్న వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. 

ఈదురు గాలుల ప్రభావంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.  అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 10 మీటర్లు ముందుకు రావటంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

నెల్లూరులో మిచాంగ్ తుఫాన్ ప్ర‌భావంతో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాగుంట లేఔట్ ప్రధాన రహదారి వెంబడి ఉన్న అపార్ట్ మెంట్లు , షాపింగ్ మాల్ లో నీటిలో మినిగిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పెన్నా పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశ ఉంది. రాయల సీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఎల్లుండి ఉతరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, హైదరబాద్​లో ఇవాళ మోస్తారు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్​లోని హైటెక్ సిటి, కూక‌ట్‌ప‌ల్లి, గ‌చ్చిబౌలి త‌దిత‌ర ప్రాంతాల్లో చిరుజ‌ల్లులు ప‌డుతున్నాయి.