అవినీతికి అండగా ఉండేందుకు సిగ్గుపడని వారికి చెంపదెబ్బ

అవినీతిపరులకు అండగా నిలవడంలో కనీస సిగ్గు కూడా పడనివారికి వ్యతిరేకంగా ఈరోజు దేశ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపిన దర్యాప్తు సంస్థల పరువు తీయడానికి అహోరాత్రులు శ్రమిస్తున్న వారు ఈ ఎన్నికల ఫలితం కూడా అవినీతిపై పోరాటానికి ప్రజల మద్దతు అని అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
 
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. మూడు రాష్ట్రాల గెలుపు గ్యారంటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
అవినీతి, బుజ్జగింపులు, కుటుంబ రాజకీయాలను ప్రజలు ఏమాత్రం సహించేది లేదని నేటి ఎన్నికలు స్పష్టం చేశాయని ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. ఈ మూడు దురాచారాలను నిర్మూలించడంలో ఎవరైనా సమర్ధవంతంగా ఉంటే అది బీజేపీ మాత్రమేనని దేశం భావిస్తోందని చెప్పారు. దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
 
దేశ వ్యతిరేక అంశాలను, దేశాన్ని బలహీనపరిచే ఆలోచనలను బలపరిచే రాజకీయాలు చేయడం మానేయాలని కాంగ్రెస్,  దాని మిత్రపక్షాలకు ఈ సందర్భంగా హితవు చెప్పారు. కాగా, ఈ ఫలితాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు రాజస్థాన్‌లకే పరిమితం కావని, ఈ ఫలితాల ప్రతిధ్వని చాలా దూరం వెళ్తుందని, ఈ ఎన్నికల ప్రతిధ్వని ప్రపంచమంతటా వినిపిస్తుందని భరోసా వ్యక్తం చేశారు.
 
ఈరోజు మనం ఫలితాలతో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని వెల్లడైందని ప్రధాని చెప్పారు. బిజెపి రెండు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో ఉందని, ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతూనే ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
 
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఓటేశారని ప్రధాని తెలిపారు. పేపర్ లీక్, రిక్రూట్‌మెంట్ స్కామ్‌లపై యువతలో అసంతృప్తి రావడం వల్లే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ప్రభుత్వాలను గద్దె దింపారని విమర్శించారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని పేర్కొంటూ వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారని ప్రధాని స్పష్టం చేశారు. 
 
మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని మోదీ  భరోసా ఇచ్చారు. 60 ఏళ్ల పాలనలో ఆదివాసీలను కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ అంచనాలకు దూరంగా ఉండేవాడిని అంటూ కానీ ఈసారి మాత్రం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు తిరుగులేదని నేను ముందే చెప్పానని గుర్తు చేశారు.  రాజస్థాన్ ప్రజలపై నాకు విశ్వాసం ఉందని చెప్పారు.
 
ఎన్నికల్లో బిజెపి జెండా రెపరెపలాడుతుందని ‘నారీ శక్తి’ నిర్ణయించిందని ర్యాలీల్లో తరచూ చెబుతుండేవాడినని గుర్తు చేశారు. నేడు ప్రతి పేదవాడు తానే గెలిచానని చెబుతున్నాడని, ప్రతి అణగారిన వ్యక్తి తన మనసులో ఎన్నికల్లో గెలిచామన్న భావన ఉంటుందని, ప్రతి రైతు ఈ ఎన్నికల్లో విజయం సాధించామని చెబుతున్నాడని, ప్రతి గిరిజన సోదర సోదరీమణులు తను తిరగబడ్డ విజయం తనదేనని భావించి సంతోషిస్తున్నారని ప్రధాని  వివరించారు. తన తొలి ఓటు ఈ గెలుపుకు కారణమని తొలిసారి ఓటరు ప్రతి ఒక్కరు గర్వంగా చెబుతున్నారని పేర్కొన్నారు.