
* కెసిఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన బిజెపి నేత
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి తాటిపల్లి వెంకట రమణారెడ్డి రాష్ట్రంలోనే సంచలన విజయం సాధించారు. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్, కాంగ్రెస్‌లో కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిలను ఓడించి `జెయింట్ కిల్లర్’గా రికార్డ్ సృష్టించారు. నిన్నటి వరకు కామారెడ్డి నియోజకవర్గానికి పరిమితమైన ఆయన పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది.
బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి దాదాపుగా 6000 మెజారిటీతో బిఆర్‌ఎస్ అభ్యర్థి కెసిఆర్‌ను ఓడించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించిన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం అసాధారణమని పరిశీలకులు చెబుతున్నారు. ఉదయం కౌంటింగ్ సమయంలో తొలి 8 రౌండ్లు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి 2 వేల ఓట్ల వరకు లీడింగ్‌లో ఉండగా.. 9వ రౌండ్ నుంచి ఫలితాలు తారుమారయ్యాయి. ప్రతిరౌండ్‌లోనూ రమణారెడ్డి ఆధిక్యత సాధిస్తూ చివరకు ప్రజా ఆశీర్వాదంతో విజయం సాధించారు.
2018 ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన రమణారెడ్డి అనుహ్యంగా ఈసారి ఉద్ధండులపై విజయం సాధించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే రమణారెడ్డి విజయం రాత్రికి రాత్రి జరగలేదు. గత ఐదేండ్లుగా ప్రజా సమస్యలపై, అధికార పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగడాలపై ఆయన చేసిన పోరాట ఫలితమే నేటి విజయమని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.
వెంకటరమణారెడ్డి విజయానికి ఆయన స్థానికులతో మమేకం కావడమే కాకుండా అక్కడి నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో పరిణతిని ప్రదర్శించి బిజెపి అభ్యర్థికి విజయం చేకూర్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న బిజెపి అభ్యర్థి రమణారెడ్డిని కాదని కెసిఆర్ ను లేదా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే వారు ఇక్కడి నుంచి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక ప్రమాదం ఉంటుందని గ్రహించిన ఓటర్లు భిన్నమైన తీర్పునిచ్చారని కూడా చెబుతున్నారు.
వెంకటరమణారెడ్డి మరో పేరు `ఉద్యమ నేత’. ఆయన కామారెడ్డిలో అవినీతికి, అక్రమాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాలు చేశారు. కొద్ది నెలల క్రితం లిక్కర్ సిండికేటును ఎదిరించి అక్కడ రేట్లు ఎంఆర్‌పికి దిగి వచ్చేలా ఉద్యమం చేశారు.
సిండికేట్ అంతా కలిసి లిక్కర్ రేటును ఎంఆర్‌పి కన్నా ఎక్కువ రేటుకు విక్రయిస్తుంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేసి ఆ రేటును ఎంఆర్‌పికి దిగి వచ్చేలా విజయం సాధించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా, స్థానికంగా ప్రభుత్వ నిధులతో ప్రైవేటు వెంచర్‌ను అభివృద్ధి చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.
డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేకుండా నిధులు వచ్చేలా మహిళా ఉద్యమం నిర్వహించారు. అంతేకాకుండా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఊరిలో కుల సంఘాలకు, దేవాలయాలకు రూ. 60 కోట్ల దాకా సొంత నిధులను ఇచ్చారు. ఈ నిధుల వితరణలో కూడా ఆయనది ప్రత్యేక స్టైల్. రమణారెడ్డి ఎవరికీ విరాళాలు నగదు రూపంలో కాకుండా నిర్మాణాలకు అవసరమైన సిమెంటు, ఇసుక, ఐరన్ ఇతరత్రాలు ఇచ్చేవారు.
అలాగే స్థానికుల ఇంట్లో శుభకార్యాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. ఇక్కడ తొమ్మిది వ్యవసాయ గ్రామాలను పారిశ్రామిక జోన్‌లో చేర్చడాన్ని వ్యతిరేకించి ఊరూరా ఉద్యమం చేసి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఉపసంహరించుకోనేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. అట్లాగని ఆయన రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కాదు.
గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా రెండేళ్లు పని చేశారు. ఆయన తండ్రి కూడా పూర్వం సమితి అధ్యక్షుడిగా ఉండేవారు. ముక్కుసూటి మనిషిగా చెబుతారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై ప్రజలతో మమేకం కావడంతోనే ఆయన అసాధారణ విజయం సాధ్యమైందని అక్కడి ప్రజలు చెప్తున్నారు.
ఈ విషయంలో బిజెపి వెంకటరమణారెడ్డి వ్యక్తిత్వాన్ని, రాజకీయ సామర్థ్యాన్ని గ్రహించి ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయడం కూడా బిజెపికి కలిసి వచ్చింది. దీనికి తోడు వెంకటరమణారెడ్డి `లోకల్ సెంటిమెంటు’ను రాజేసి తాను అనునిత్యం అందుబాటులో ఉంటానని ప్రచారం చేయడం కూడా ఆయన విజయానికి బాటలు పరిచింది.
More Stories
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు
జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నాను