పన్నూన్‌ హత్యకు కుట్రపై భారత్‌కు సీఐఏ చీఫ్

సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు గతంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. 
 
అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్‌ విలియం బర్న్స్‌ గత ఆగస్టులో భారత్‌కు వచ్చినట్లు పేర్కొంది. భారత్‌కు వచ్చిన విలియం బర్న్స్‌ ఇక్కడి రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌ చీఫ్ రవి సిన్హాతో భేటీ అయినట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది.  పన్నూ హత్యకు జరిగిన కుట్రపై విచారణ అవసరమని, అందుకు భారత్‌ సహకరించాలని ఆయన కోరినట్లు తెలిపింది.
భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్‌ నుంచి అమెరికా స్పష్టమైన హామీ కోరినట్లు సమాచారం. పన్నూ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు జూలైలోనే వదంతులు వినిపించాయి.  ఈ నేపథ్యంలో ఇరుదేశాల ఉన్నత స్థాయి అధికారులు పరస్పరం చర్చలు జరిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అమెరికా డిమాండ్‌ చేసింది. మరోవైపు సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌  ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ విషయాన్ని కూడా లేవనెత్తినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. 
 
నవంబర్‌లో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ భారత్‌ పర్యటన సందర్భంగానూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది. అమెరికా అందించిన సమాచారం మేరకు భారత్‌ అప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. 
 
అంతలోనే భారతీయుడిపై అభియోగాలు మోపడంతోపాటు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం చర్చనీయాంశమైంది. పన్నూ హత్యకు కుట్ర పన్నాడని భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడం ఆందోళన కలిగించే విషయమని గురువారం భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది.