రాజస్థాన్, ఎంపీల్లో బిజెపి, ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌, తెలంగాణల్లో కాంగ్రెస్!

* పోటీ తీవ్రంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో చివరిగా తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడంతో గురువారం సాయంత్రం వివిధ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు రెండు పార్టీలకు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.  వాటిని పరిశీలిస్తే రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో స్పష్టమైన మెజారిటీతో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని వెల్లడవుతున్నాయి. 
 
అయితే, ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌, తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్ కొంచెం ముందంజలో ఉన్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ పొందటం పట్ల సందిగ్ధత నెలకొంది. రాజస్థాన్ లో కాంగ్రెస్, తెలంగాణాలో బిఆర్ఎస్ అధికారం కోల్పోబోతున్న ట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. మిజోరాంలో సహితం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని సూచిస్తున్నాయి.  
 
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ నెల‌కొన‌గా ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు సైతం హోరాహోరీ పోరు నెల‌కొంద‌నే సంకేతాలు పంపాయి. 
బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి త‌ల‌ప‌డిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌ఢ్‌, రాజ‌స్ధాన్‌లలో ఇరు పార్టీల మ‌ధ్య ఓట్లు, సీట్ల మ‌ధ్య తేడా స్వ‌ల్పంగా ఉండ‌టంతో ఇత‌రులు కీల‌క పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను బట్టి చూస్తే రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఈ సారి షాక్ తగిలేలా ఉంది. 200 స్థానాలున్న అసెంబ్లీలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 100 సీట్లలో గెలవాలి.
 
అయితే ఈ ఎడారి రాష్ట్రంలో ప్రతి అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారే అనవాయితీ ఉంది. కానీ దీనికి భిన్నంగా ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. అయితే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మాత్రం పాత సంప్రదాయం పునరావృతం కానుందని అంచనా వేస్తున్నాయి. మెజారిటీ పోల్స్ బిజెపికి పట్టం కట్టబెట్టాయి.ఆ పార్టీకి 100నుంచి 120 దాకా స్థానాలు రావచ్చని అంచనా వేశాయి.
 
టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి రాజస్తాన్ లో 108-128 స్ధానాలు దక్కుతాయని తేలింది. అలాగే రెండో స్ధానంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 56-72 సీట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. రాజస్తాన్ ఎన్నికలపై టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్య ఓట్ల శాతం, సీట్లలోనూ భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాపడం కష్టమేనని తేలిపోయింది.
 
మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కమల్‌నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బిజెపి అధికారం చేపట్టింది.230స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 116స్థానాల్లో గెలవాలి.
 
రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నా, బిజెపికి స్పష్టమైన మెజారిటీ తధ్యమని పలు సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ.. మ్యాట్రిజ్ తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడినా అంతిమంగా రెండో స్ధానంలో నిలుస్తుందని తేలిపోయింది.

రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల వివరాలు చూస్తే.. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి అత్యధికంగా 118-130 సీట్లు దక్కుతాయని తేలింది. ఆ తర్వాత స్ధానంలో కాంగ్రెస్ పార్టీకి 97-107 సీట్లు మాత్రమే దక్కుతున్నట్లు తేలింది. ఇతరులకు 1-2 సీట్లు దక్కుతాయని రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.
 
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమయిన చత్తీస్‌గఢ్‌లో ఓటర్లు మరోసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టనున్నారని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం లోకి రావచ్చని అంచనా వేశాయి. ఆ పార్టీకి 49నుంచి 64 స్థానాల దాకా రావచ్చని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. 
 
అదే సమయంలో గత ఎన్నికల్లో 15 సీట్లు మాత్రమే గెలుచుకున్న బిజెపిటీకి ఈ సారి భారీగానే స్థానాలు పెరగవచ్చని అంచనా వేశాయి. రెండు పార్టీల మధ్య తేడా చాలా తక్కువ సీట్లుగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో ప్రభావం చూపిన బిఎస్‌పి, అజిత్ జోగి పార్టీలకు ఈ సారి భంగపాటే ఎదురు కానుందని పేర్కొన్నాయి.
 
మిజోరాంలో హంగ్ అసెంబ్లీ
 
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ అంచనా ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 15-21, జెడ్‌పీఎంకు 12-18, కాంగ్రెస్‌కు 2-8, బీజేపీకి 0 సీట్లు రానున్నాయి. ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 14-18, జెడ్‌పీఎంకు 12-16, కాంగ్రెస్‌కు 8-10, బీజేపీకి 0-2 స్థానాలు దక్కనున్నాయి. జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 10-14, జెడ్‌పీఎంకు 15-25, కాంగ్రెస్‌కు 5-9, బీజేపీకి 0-2 సీట్లు రానున్నాయి. రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ అంచనా ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 17-22, జెడ్‌పీఎంకు 7-12, కాంగ్రెస్‌కు 7-10, బీజేపీ 1-2 స్థానాల్లో గెలువనున్నాయి. టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ఎంఎన్‌ఎఫ్‌కు 14-18, జెడ్‌పీఎంకు 10-14, కాంగ్రెస్‌కు 9-13, బీజేపీకి 0-2 సీట్లు దక్కనున్నాయి.