మణిపూర్ తిరుగుబాటు గ్రూప్‌, కేంద్రం మధ్య శాంతి ఒప్పందం

మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్‌ఎల్‌ఎఫ్), కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ఆ మిలిటెంట్‌ సంస్థ ముగింపు పలికింది.  ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
మణిపూర్‌ లోయ ప్రాంతాల్లో ప్రభావితంగా ఉన్న పురాతన సాయుధ సమూహం యూఎన్‌ఎల్‌ఎఫ్‌ హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరడానికి అంగీకరించినట్లు చెప్పారు.  పురోగతి పథంలో ప్రయాణించేందుకు ప్రజాస్వామ్యంలోకి వారిని స్వాగతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. యూఎన్‌ఎల్‌ఎఫ్‌ క్యాడర్‌ తమ ఆయుధాలను అప్పగించిన వీడియోను కూడా షేర్‌ చేశారు.
 
కాగా, మణిపూర్‌లోని లోయ ప్రాంతంలో మెజార్టీ వర్గమైన మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొండ ప్రాంతాల్లో ఆధిక్యత ఉన్న కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. మే 3న భారీ ర్యాలీ నిరసన నిర్వహించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.  నాటి నుంచి అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్‌ అల్లాడిపోయింది.
సుమారు 200 మంది ప్రజలు మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు మణిపూర్‌లో జాతి హింస చెలరేగిన తర్వాత లోయ ప్రాంతానికి చెందిన నిషేధిత సంస్థ యూఎన్‌ఎల్‌ఎఫ్‌తో ప్రభుత్వం శాంతి చర్చలు జరుపడం ఇదే తొలిసారి.  చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత గ్రూప్‌లో యూఎన్‌ఎల్‌ఎఫ్‌ కూడా ఉంది.

కాగా, తిరుగుబాటు సంస్థ యూఎన్‌ఎల్‌ఎఫ్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేయబోతున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నవంబర్ 26న ప్రకటించారు. అలాగే మణిపూర్‌లోని మైతీ మిలిటెంట్ గ్రూపులపై నిషేధాన్ని అమలు చేయడం, ఆంక్షలు కొనసాగించాలా వద్దా అని నిర్ణయించడానికి ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.