మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తారా జగన్?

నాగార్జున సాగర్ వద్దకు పోలీసులను మోహరింపచేసి, తెలంగాణ పోలీసులతో ఘర్షణకు కాలుదువ్వడం పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
 
విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రథాన్ని ప్రారంభిస్తూ గతంలో ఏపీ, తెలంగాణ అధికారులు ఈ విషయంలో ఘర్షణ పడ్డారని ఆమె గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా చేస్తారా? అని ఆమె దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే ఈ వివాదం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 400 మండలాల్లో కరవు విలయతాండవం చేస్తుండగా  ప్రభుత్వం మాత్రం కేవలం 100 మండలాల్లోనే కరువు ఉందని చెప్పడం రైతులను అవమానించడమేనని పురందేశ్వరి తెలిపారు. కరవు విషయంలో క్యాబినెట్‌లో కూడా చర్చ జరగకపోవడం శోచనీయం అని పెక్రోన్నారు. 

అసలు ఏపీలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే ప్రజలు వెతుక్కుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. అదే నీటిపారుదల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం చెబుతున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీకి సీఎం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆస్పత్రిలో సేవలు నిలిపి వేస్తున్నారని  ఆమె విమర్శించారు. 

కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని పురంధరేశ్వరి తెలిపారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. చెబుతూ 

వికసిత్ భారత్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేస్తున్నామని కేంద్రం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తామని  ఆమె చెప్పారు. వికసిత్ భారత్ పేరుతో ఏపీలో 50 వ్యాన్ లతో యాత్ర సాగుతుందని ఆమె వెల్లడించారు.  ప్రజల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం గురించి ప్రజలు తెలుసుకోవాలని ఆమె కోరారు. 

ఇళ్లు రాని వారు ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుందని చెబుతూ ఇటువంటి వాటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు.