ఉత్తర కాశీలో 41 మంది కార్మికులు ఎలా బయట పడ్డారంటే..?

అందరి ప్రార్థనలు ఫలించాయి.. 17 రోజులుగా సొరంగంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటి ప్రపంచానికి చేరుకున్నారు. పర్యావరణానికి ముప్పు అని నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ అనే పద్దతే ఇవాళ 41 మంది కార్మికుల ప్రాణాలను కాపాడింది. విషయంలోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 12న దీపావళి పండుగ నాడు తెల్లవారుజామున టన్నెల్‌లో కొంత భాగం కూలడంతో 8 రాష్ట్రాలకు చెందిన 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 17 రోజుల పాటు సొరంగంలోనే చిక్కుకుపోయిన కార్మికులను మంగళవారం రాత్రి రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. అత్యంత సంక్లిష్ట ఆపరేషన్ లో కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ దళాలు, ఐటీబీపీ, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌వో)లు తమ సహాయక చర్యలు చేపట్టాయి.

కాగా, టన్నెల్‌లో 57 మీటర్ల వరకు శిథిలాలు పేరుకున్నాయి. వీటిని తొలుస్తూ.. 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లైన్‌ వేసి దానిలో నుంచి కూలీలను తీసుకురావాలని అధికారులు ప్రణాళిక రచించారు. క్లిష్టమైన డ్రిల్లింగ్‌నూ చేయగల అమెరికన్‌ ఆగర్‌ యంత్రాన్ని తెప్పించారు. దాదాపు 47 మీటర్ల మేర తవ్వాక.. సొరంగం నిర్మాణంలో ఉపయోగించిన ఇనుప పట్టీలు అడ్డుపడి ఆగర్‌ యంత్రం బ్లేడ్లు పూర్తిగా విరిగిపోయాయి. ఆగర్‌ యంత్రం విరిగిపోవడం.. మరో యంత్రాన్ని ఇండోర్‌ నుంచి తెప్పించినా ప్రయోజనం లేదని తేలడంతో అధికారులు సొరంగంపైన ఉన్న కొండను నిలువునా తవ్వాలని నిర్ణయించారు. అందుకోసం ర్యాట్ హోల్ మైనింగ్ పద్దతిని అనుసరించారు. కానీ ఈ పద్దతి నిషేధంలో ఉంది.

ఏమిటీ ఈ ర్యాట్ హోల్ మైనింగ్?
ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాట్ హోల్ మైనింగ్ చాలా ఫేమస్. ముఖ్యంగా మేఘాలయలో ఈ పద్దతిని బాగా అనుసరించేవారు. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తు బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ ప్రొఫెషన్ లో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనింగ్ పద్దతిని అనుసరించడం ఇదే తొలిసారి.

వాస్తవానికి, ర్యాట్ హోల్ మైనింగ్ పై అనేక విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ పద్దతిలో కార్మికుల ప్రాణాలకు ఎలాంటి భద్రత ఉండదు. లోపలికి వెళ్లిన కార్మికులకు వెలుతురు ఉండదు. గనులు కూలిపోవడం, వర్షాలు వచ్చినప్పుడు ఆ హోల్స్ అన్ని నీటితో నిండిపోవడం వంటి అతి ప్రమాదకర పరిస్థితులు కార్మికులకు ఎదురవుతుండేవి. ఈ పద్దతిలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పర్యావరణ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో 2014లో ఎన్జీటీ ర్యాట్ హోల్ మైనింగ్ పద్దతి అశాస్త్రీయం అని.. సురక్షితం కాదంటూ దానిపై నిషేధం విధించింది. కానీ ఇవాళ ఆ పద్దతే 41 మంది కార్మికుల ప్రాణాలను నిలబెట్టింది.

చార్ ధామ్ యాత్రకు అనుగుణంగా..
చార్ ధామ్ యాత్రకు అన్ని కాలాల్లోనే సాఫీగా ప్రయాణం చేసేందుకు ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ధారాసు-బార్‌కోట్‌-యమునోత్రి మార్గంలోని 134వ నంబర్ జాతీయ రహదారి 26 కిమీ మార్గం చలికాలంలో మంచుతో మూసుకుపోతుంది. టన్నెల్ నిర్మాణంతో ఈ దూరం 4.5 కిమీ.. ప్రయాణ సమయం 50 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గుతుంది. రెండు వరుసల్లో రూ.1383 కోట్ల వ్యయంతో ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. బ్రహ్మఖల్‌-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్‌గావ్‌ సమీపాన 4.5 కి.మీ. మేర ఈ సొరంగం తవ్వుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించటం, కార్మికులు చిక్కుకు పోవటం జరిగింది.