సనాతన ధర్మం మానవాళికి మేలు కలిగించే జీవన విధానం

సనాతన ధర్మం కేవలం ఆద్యాత్మికతకు సంబంధించిన అంశమే కాదని, అది శాస్త్రీయంగా మానవాళికి మేలు కలిగించే జీవన విధానమని శాస్త్రీయంగా రుజువు చేయబడిందని తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సాయి సౌందరరాజన్, స్పష్టం చేశారు.  భాగ్యనగరంలోని సీతారాం భాగ్ లో ఉన్న ప్రాచీన శ్రీరామ మందిరంలో అక్టోబర్ 15 నుండి  45 రోజుల పాటు నిర్వహించిన భారత భాగ్య సమృద్ది యజ్ఞం ముగింపు కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

విదేశాలలో దీనిపై ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు జరిగాయని, ముఖ్యంగా ఓంకారం పలుకడంపై ఎందరో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారని అంటూ ఓంకారం నిరంతరం పలుకడం ద్వారా మానవ శరీరానికి శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు కలుగుతుందని నిరూపణ అయినట్లు  గవర్నర్ తెలిపారు. మానవ నాడీ వ్యవస్థపై ఓంకారం ఎంతో ప్రభావం చూపుతుందని ఆమె చెప్పారు.

ఇలాంటి యజ్ఞాలు సమాజంలో చెడు ప్రభావాన్ని తగ్గించి మంచిని పెంచుతాయని చెబుతూ  చిన్నారులలో ఆధ్యాత్మిక భావాలు నాటాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వారు త్వరగా వీటిని ఆకలింపు చేసుకొంటారని తెలిపారు.  చిన్నారుల ఎదుగదలే కాకుండా మానసిక స్థితిపై కూడా ఆధ్యాత్మికత ప్రభావం చూపుతుందనగా అవునని కార్యక్రమానికి హాజరైన ఒక చిన్నారి అనగా ప్రశంసించారు.

 45 రోజుల పాటూ నిర్వహించబడిన ఈ మహత్తర యజ్ఞ సందర్శన సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉండాలని శివున్ని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.  ఆద్యాత్మిక భావాలతో కూడిన శ్రీమతి మాధవిలత కొంపెల్ల దేశ అభ్యున్నతి కోసం యజ్ఞం నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. అనంతరం యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం వేద మంత్రాల మధ్య సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ నిర్వాహకురాలు శ్రీమతి మాథవి లత కొంపెల్ల యజ్ఞ నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.