న్యూయార్క్‌ లో భారత రాయబారిపై దాడికి ఖలీస్థానీల యత్నం

న్యూయార్క్‌ లో భారత రాయబారిపై దాడికి ఖలీస్థానీల యత్నం
అమెరికాలో ఖలీస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్క్ గురుద్వారా వద్ద భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుపై దాడికి తెగబడ్డారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని లాంగ్ ఐలాండ్‌లోని హిక్స్‌విల్లే గురుద్వారాను తరంజిత్ సింగ్ సందర్శించారు. 
 
ఈ సమయంలో ఖలీస్థానీ నిరసనకారులు ఆయనను చుట్టుముట్టి భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు పథకం పన్నారని, గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.  సంధు, ఖలిస్థానీ నిరసనకారుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
తాను సేవ (సేవ) కోసం గురుద్వారాను సందర్శించినట్టు నిరసనకారులకు రాయబారి చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఒక నిరసనకారుడు పంజాబీలో.. ‘హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నువ్వే బాధ్యుడివి. పన్నూన్‌ను చంపడానికి కుట్ర చేశారు’ అని అరవడం వినిపిస్తోంది.  అక్కడున్న మరికొందరు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంధును వెంబడించిన నిరసనకారులు.. ‘ఎందుకు సమాధానం చెప్పరు?’ అని అడగడం వినబడుతోంది. ఖలిస్థాన్ రిఫరెండం విఫలం, గురుపత్వంత్ హత్యకు కుట్రలో భారత పాత్ర గురించి నిరాధారమైన ప్రశ్నలతో తరంజిత్ సింగ్ సంధును ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. హిక్స్‌విల్లే గురుద్వారా ద్వారా వద్ద ఖలీస్థాన్ మద్దతుదారుల నిరసనలో హిమ్మత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.

కాగా, ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే తరంజిత్ సింగ్ సంధూ తాను హిక్స్‌విల్లే గురుద్వారాను సందర్శించినట్టు ట్విట్ చేయడం గమనార్హం. ‘లాంగ్ ఐలాండ్‌లోని గురునానక్ దర్బార్‌లో జరుపుకున్న గురుపూరబ్ వేడుకల్లో ఆఫ్ఘనిస్థాన్ సహా స్థానిక సంగత్‌లో చేరడం సంతోషంగా ఉంది. గురునానక్ కీర్తనలు పాడి.. నానక్ బోధించిన ఐక్యత, సమానత్వం శాశ్వతమైన సందేశం గురించి మాట్లాడారు.. వేడుకల్లో పాల్గొన్న అందరూ ఆశీర్వాదాలను కోరుకున్నారు’ అని పేర్కొన్నారు.

కాగా, గత జూన్ 8న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఖలీస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన రెండు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది.

 
ఈ ఆరోపణలను కొట్టిపారేసిన భారత్ కెనడా ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. తాము దర్యాప్తును తోసిపుచ్చడం లేదని,కెనడా తన ఆరోపణలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను అందించాలని డిమాండ్ చేసింది. ఇటీవల, అమెరికాలో సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్య కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు.