విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 60కి పైగా మరబోట్లు దగ్ధం

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. ఖరీదైన బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులకు కోట్లలో నష్టం వాటిల్లింది.
సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదు.
గుర్తుతెలియని వ్యక్తులే నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు రేగడంతో మత్స్యకారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న మూడు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి.
మరో మూడు శకటాలను రప్పించేందుకు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ చర్యలు తీసుకున్నారు. అయితే సముద్ర గాలులకు మంటలు మరింతగా రేగి పక్కనున్న బోట్లకు విస్తరించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత నష్టం తగ్గింది.
వాటిని అదుపు చేసేందుకు మత్స్యకారులు ప్రయత్నిస్తుండగానే క్షణాల్లో ఇతర బోట్లకు వ్యాపించాయి. ఓ బోటులో మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలో పక్కబోట్లకు విస్తరించాయి.
మంటలు వ్యాపించి పడవలను చుట్టుముట్టడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు భయాందోళనకు గురై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు.బోట్లలో నిల్వ చేసిన డీజిల్, మత్స్యకారులు వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి.  ప్రమాదంలో బోట్లలో ఎవరైనా నిద్రిస్తున్నారని మత్స్యకారులు ఆందోళన చెందారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వాటిని పరిశీలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.