వారం రోజులుగా సొరంగ చీకటిలోనే 40 మంది కూలీలు

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా పరిధి చార్‌ధామ్‌ రోడ్డు ప్రాజెక్టులో కుప్పకూలిన సిల్‌క్యారా టన్నెల్ వద్ద సహాయక చర్యలు పలు ఆటంకాలతో 24 గంటలుగా నిలిచిపోయాయి. దీనితో సొరంగంలో చిక్కుకుపోయిన 40 మంది కూలీల పరిస్థితి మరింత ప్రశ్నార్థకం అయింది.  ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చిన అత్యంత అధునాతన అమెరికా నిర్మిత ఔగెర్ మిషిన్‌లో యాంత్రిక లోపం ఏర్పడటం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. 

అమెరికన్‌ ఆగర్‌ యంత్రం శుక్రవారం మధ్యాహ్నం శిథిలాలను తొలుస్తుండగా భారీ శబ్దంతో పగుళ్లు వచ్చాయి. దీంతో ముందుజాగ్రత్తగా పనులకు నిలిపివేశారు. మొత్తం 60 మీటర్ల మేర శిథిలాలు పేరుకోగా, అప్పటికి 24 మీటర్ల వరకు తొలగించారు. శనివారం డ్రిల్లింగే చేయలేదు. మరోవైపు కూలీలను బయటకు తెచ్చేందుకు (ఎస్కేప్‌ చానల్‌) 900 ఎంఎం వ్యాసం, ఆరు మీటర్ల పొడవైన పైప్‌లలో ఐదోదానిని పంపుతుండగా పెద్ద శబ్దంతో పగుళ్లు వచ్చాయి. 

ఇండోర్‌ నుంచి తెప్పించిన రెండో ఆగర్‌ యంత్రం మూడు విడి భాగాల అసెంబ్లింగ్‌కే 4-5 గంటలు పట్టే అవకాశం ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అదనపు కార్యదర్శి మహమూద్‌ అహ్మద్‌, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఉప కార్యదర్శి మంగేష్‌ గిల్డియాల్‌ తదితరులతో కూడిన ఉన్నతాధికారుల బృందం సిల్క్యారా చేరుకుని.. సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఆదివారం నుంచి టన్నెల్‌లో చిక్కుపడి ఉన్న కూలీల సంఖ్య 40 కాదని 41 అని శనివారం అధికారులు నిర్ధారించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా ఈ టన్నెల్‌లో పనిచేస్తున్నారని నిర్థారణ అయింది. దీనితో ఇప్పుడు లోపల బందీలుగా మారి తిరిగి వెలుగులోకి వస్తామనే ఆశలు కూలీల్లో అడుగంటుతున్నాయి.

జాతీయ ప్రధాన రహదారుల మౌలిక ఏర్పాట్ల సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఛార్‌దామ్ ప్రాజెక్టు చేపట్టింది. ప్రాజెక్టు పనులను నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ (ఎన్‌ఇసి) ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టన్నెల్ నిర్మాణం ద్వారా ప్రయాణ దూరం తగ్గించేందుకు వీలేర్పడుతుంది. 

అంతేకాకుండా ఎటువంటి వాతావరణంలో అయినా యాత్రికులు తమ యాత్రను కొనసాగించేందుకు వీలుంటుంది. టన్నెల్ వద్ద కూలీల వెలికితీత కార్యక్రమాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని తమ అధికారిక నివాసం నుంచి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల వెలికితీతకు యత్నాలు జరుగుతుండగా, నిర్మాణంలో ఒక ఘోర తప్పిదం బయటపడింది. ప్రమాదాలు చోటుచేసుకుంటే వాటి నుంచి తప్పించుకునేందుకు ఎస్కేప్‌ రూట్‌ను ప్లాన్‌లో రూపొందించినా దానిని చేపట్టిన కంపెనీ దానిని నిర్మించలేదు. తప్పించుకొనే మార్గం నిర్మించి ఉంటే కార్మికులకు ఈ దుస్థితి వచ్చేది కాదని బాధిత కుటుంబ సభ్యులు, పలువురు నేతలు విమర్శిస్తున్నారు.