ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఆడపిల్ల పేరు మీద రూ.2 లక్షల పొదుపు బాండ్, బాలికలకు 12వ తరగతి పూర్తయితే ఉచిత స్కూటీలు వంటి పలు హామీలతో రాజస్థాన్ లో బిజెపి ఎన్నికల ప్రణాలికను విడుదల చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నేతలతో కలిసి జైపుర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీజేపీ మహిళా సాధికారత మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ కేసులను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, సతీష్ పూనియా తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్, మహిళా సాధికారత, పేద, బడుగు బలహీనవర్గాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్లు నడ్డా పేర్కొన్నారు.
విద్యార్దులకు ఇచ్చిన హామీల్లో పేద విద్యార్దులకు పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అవసరాల కోసం ఏటా రూ.12వేలు ఇస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రతీ డివిజన్ లోనూ రాజస్తాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది.
ఆరోగ్య రంగంలో, భామాషా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడి, 15,000 మంది వైద్యులు, 20,000 మంది పారామెడికల్ సిబ్బంది నియామకానికి పార్టీ హామీ ఇచ్చింది.
మేనిఫెస్టోలో పథకాలు
1. ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే గోధుమపై క్వింటాల్‌కు రూ.2 వేల 700 బోనస్.
2. ఆడపిల్లల కోసం లాడో ప్రోత్సాహన్ యోజన. దీని కింద మధ్యప్రదేశ్‌లోని ప్రతి ఆడపిల్ల పేరు మీద రూ.2 లక్షల పొదుపు బాండ్.
3. బాలికలు ఆరో తరగతిలో ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.6 వేలు, 9వ తరగతిలో ఏడాదికి రూ. 8 వేలు, 10వ తరగతిలో రూ.10 వేలు, 11వ తరగతిలో రూ.12 వేలు, రూ.14 వేలు, గ్రాడ్యుయేషన్ చేస్తున్న బాలికలకు రూ. 50 వేలు అందిస్తారు. 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు రూ.లక్ష సాయం.
4. ప్రతిభావంతులైన బాలికలకు 12వ తరగతి పూర్తయితే ఉచిత స్కూటీలు.
5. ‘లఖపతి దీదీ’ పథకం కింద ఆరు లక్షల గ్రామీణ మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం
6. ఉజ్వల పథకం కింద రూ. 450కే గ్యాస్ సిలిండర్.
7. మాతృ వందన్ యోజన కింద నగదు ప్రోత్సాహకం రూ.8,000 కు పెంపు.
8. విద్యార్థులు విద్యాసామగ్రి కొనుగోలు చేయడానికి రూ.12 వందల ప్రోత్సాహకం.
9. వైద్య రంగాన్ని మెరుగుపరిచేందుకు రూ.40 వేల కోట్లు కేటాయింపు. 15 వేల మంది వైద్యులు, 20 వేల మంది పారామెడికల్ సిబ్బంది నియామకం.
More Stories
చంద్రయాన్-5 మిషన్కు కేంద్రం ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు