ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ తో ఆస్ట్రేలియా ఢీ

ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా పోరాటం మరోసారి సెమీ ఫైనల్లోనే ముగియడంతో గురువారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో ఆదివారం అహ్మదాబాద్‌లో టీమిండియాతో జరిగే తుది సమరానికి ఆస్ట్రేలియా అర్హత సాధించింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలని భావించిన దక్షిణాఫ్రికాకు మళ్లీ నిరాశే మిగిలింది. 
 
ఇన్నాళ్లూ ఐసిసి నిబంధనలు, వర్షం, డీఆర్‌ఎస్‌లు ఆ జట్టు ఫైనల్‌ చేరకుండా అడ్డుకుంటే ఈసారి బ్యాటింగ్‌ వైఫల్యం, తర్వాత ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడవడంతో దక్షిణాఫ్రికాకు మరోసారి నిరాశ తప్పలేదు. మెగా టోర్నీ ఆరంభంలో భారీస్కోర్లతో, దూకుడైన బ్యాటింగ్‌, బెంబేలెత్తించే బౌలింగ్‌, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న సఫారీలు.. కీలకమైన నాకౌట్‌ దశలో తేలిపోయారు. 
 
బ్యాటింగ్‌లో విఫలమైనా స్పిన్నర్లు కట్టడి చేయడంతో ఒక దశలో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చినా కంగారూలు పట్టు విడవకుండా ఆడటంతో సఫారీల పోరాటం మరోసారి సెమీస్‌కే పరిమితమైంది. దీంతో ఐదుసార్లు టైటిల్‌ విజేత ఆస్ట్రేలియా జట్టు మరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 49.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది.

తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు ఆస్ట్రేలియాకు మెరుపు ఆరంభాన్ని అందించారు.  దూకుడుగా ఆడిన వార్నర్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో వేగంగా 29 పరుగులు చేశాడు.

మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్ 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. మిగతా వారలో స్టీవ్ స్మిత్ (30), ఇంగ్లిస్ (28), స్టార్క్ 16 (నాటౌట్), కమిన్స్ 14 (నాటౌట్) రాణించారు.  సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఒక దశలో 24 సౌతాఫ్రికా 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 

అయితే క్లాసెన్ (47)తో కలిసి మిల్లర్ పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్ 8 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 101 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించాడు. వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఆసీస్‌ ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5 సార్లు విజేతగా నిలవగా, టీమిండియా రెండు పర్యాయాలు కప్‌ నెగ్గింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హెడ్‌కు లభించింది.