ఉరిలో ఉగ్రవాదుల చొరబాటుయత్నం.. ఇద్దరు కాల్చివేత

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటును సైన్యం భగ్నం చేసింది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుంది. సైన్యం కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. 
 
నియంత్రణ రేఖ వెంబడి తీవ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుందని తెలిపారు. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. ఆయుధాలు, పేలు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఉగ్రవాదుల కోసం ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు ట్వీట్ చేశారు. 
 
ఉగ్రవాదులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. గతవారం పుల్వామాలోని పరిగామ్ వద్ద ఉగ్రవాదులున్నారనే సమాచారంతో సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

తొలుత తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగాయి. అనంతరం ఉగ్రవాదులు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. దీనికి రెండు రోజుల ముందు షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది.  కథోహలన్ వద్ద జరిగిన ఈ కాల్పుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాది హతమైనట్టు సైన్యం ప్రకటించింది. అక్టోబరు 26న కుప్వారా వద్ద ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అంతకు ముందు అక్టోబరు 22న ఉరి వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ముష్కరులను కాల్చి చంపారు.

శివాలయం సమీపంలో పేలుళ్లు       
 
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఓ ఆలయం సమీపంలో పేలుడు సంభవించింది. జిల్లాలోని సురాన్‌కోట్‌ టౌన్‌లో ఉన్న శివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. బుధవారం రాత్రి 8.20 గంటల సమయంలో శివాలయం సమీపంలో ఉన్న బస్‌స్టాండ్‌ వద్ద భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. దీంతో హుటాహుటిన పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.
 
కాగా, ఇది ఎలాంటి పేలుడు అనే విషయంపై ఇంకా స్పష్టత రానప్పటికీ దుండగులు గ్రెనేడ్‌ విసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. పేలుడు ధాటికి ఆలయ గోడలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. కాగా, పేలుళ్ల వల్ల ఎవరికి హాని జరుగలేదని తెలిపారు.