విరాట్ కోహ్లీకి ప్రధాని, సచిన్ అభినందనలు

విరాట్ కోహ్లీకి ప్రధాని, సచిన్ అభినందనలు
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్లో న్యూజీలాండ్ పై అద్భుత సెంచరీతో సచిన్ 49 సెంచరీల రికార్డును అధిగమించి 50వ సెంచరీ చేసిన కింగ్ విరాట్ కొహ్లీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కొహ్లీ 50 సెంచరీల వరల్డ్ రికార్డుపై పలువువు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు, ఫ్యాన్స్, రాజకీయ నేతలు కూడా అభినందనలతో ముంచెత్తుతున్నారు
 
ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా విరాట్ కొహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇదులో ప్రధాని మోదీ .. అతను(విరాట్ కొహ్లీ) కేవలం తన 50వ వన్డే సెంచరీని సాధించడమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్ఠత, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడని కొనియాడారు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.
 
అలాగే తాను విరాట్ కొహ్లీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాననని ప్రధాని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆయన ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పుతూనే ఉంటాడని మోదీ ఆకాంక్షించారు. తద్వారా విరాట్ కొహ్లీ సాధించిన ఘనత దేశంలోని ప్రజలతో పాటు భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిదాయయం కావాలని ప్రధాని మోదీ కోరుకున్నట్లయింది.

కాగా, తన శిష్యుడు తన సమక్షంలోనే తన రికార్డును బద్ధలు కొట్టడం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ కు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. దీంతో విరాట్ సెంచరీ పూర్తికాగానే పైకి లేచి మరీ.. సచిన్ చప్పట్లు కొట్టాడు విరాట్ కోహ్లి సైతం గ్రౌండ్లో నుంచే సచిన్‌కు పాదాభివందనం చేసి గురువు పట్ల కృతజ్ఞత తెలియజేశాడు. మరోవైపు ఎవరూ సాధించలేరని అనుకున్న తన రికార్డును ఓ భారతీయుడు బద్ధలుకొట్టడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

విరాట్ కోహ్లితో తనకున్న అనుబంధాన్ని ఓ ఎమోషనల్ ట్వీట్ రూపంలో పంచుకున్నాడు. విరాట్ కోహ్లి కెరీర్ తొలినాళ్లలో డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ గాడ్ పంచుకున్నాడు. విరాట్ కోహ్లిని తొలిసారి డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు ఏం జరిగిందో గుర్తుచేసుకున్నాడు.

“ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో తొలిసారిగా నేను నిన్ను కలిసినప్పుడు నా కాళ్లను తాకాలంటూ మిగతా ప్లేయర్లను నిన్ను ఆటపట్టించారు. ఆ సందర్భంలో నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ కొద్దిరోజుల్లోనే నువ్వు నీ ఆటతీరు, నైపుణ్యంతో నా మనసును తాకావు. అప్పటి ఆ కుర్రాడు ఇప్పటి విరాట్‌గా ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారతీయుడు నా రికార్డు అధిగమించినందుకు మాత్రమే నేను సంతోషించడం లేదు. ప్రపంచకప్ సెమీఫైనల్ లాంటి పెద్దవేదిక మీద, నా సొంత మైదానంలో ఇది జరగడం నాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది”.. అంటూ సచిన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
2009లో శ్రీలంకపై కోల్‍కతాలో తొలి వన్డే శకతం చేశాడు విరాట్ కోహ్లీ. 14 ఏళ్లలోనే 50వ శతకానికి చేరాడు. అందులోనూ అతి ముఖ్యమైన వన్డే ప్రపంచకప్ 2023 సెమీస్‍లో సెంచరీ చేసి.. జట్టుకు భారీ స్కోరు అందించాడు.