మంత్రి సబితా అనుచరుల ఇళ్లల్లో రూ.12.5 కోట్లు జప్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ సోదాలు రాజకీయంగా  కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరగ్గా, ఈనెల 13న ఉదయం నుంచి నగరంలోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 
 
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. గత మూడు రోజులుగా మంత్రి సబిత అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా నేటితో సోదాలు ముగిశాయి. ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి.
 
నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బు మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు.

ఇటీవల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో వారం క్రితం ఐటీ దాడులు జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్‌ఆర్‌, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాల్లోనూ ఇటీవల కాలంలో ఐటీ దాడులు జరిగాయి.
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. తాజాగా, మంత్రి సబితా అనుచురడి ఇంట్లో దాడులు జరగ్గా దాడుల్లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడం కలకలం రేపుతోంది. ఎన్నికల్లో పంచేందుకే ఈ డబ్బు నిల్వ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.