వడ్డీలు కూడా కట్టలేని దివాళా స్థితిలో ఏపీ ఆర్ధిక పరిస్థితి

క్రిసిల్  ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన బాండ్ లకు  పదే పదే రేటింగ్ (ఎ+ నుంచి ఎ, ఎ   నుంచి బిబిబి+) తగ్గిస్తూ ఉండటం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వడ్డీలు కట్టలేని ఆర్థిక దివాళా స్థితిలోకి పోయిన పరిస్థితులు కనబడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నేతి మహేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రఖ్యాత సంస్థ పదే పదే రేటింగ్ తగ్గిస్తూ  ఉన్నాకూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ విధంగా క్రిసిల్ రేటింగ్ తగ్గిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ముబ్బడి దిబ్బడిగా రుణాలకు అనుమతులు ఇస్తుండటం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. 
బాండ్ లు ఇచ్చిన అప్పటి నుంచి రేటింగ్ తగ్గించే నివేదిక వరకు పరిశీలిస్తే 2018 లో సంస్థ ఏపిసిఆర్డీఏ బాండ్ ల మీద ఇచ్చిన రేటింగ్  ఎ+ ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఈ రేటింగ్ తక్కువ అనుకోవచ్చని తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలలో తిరిగి చెల్లించలేని ప్రమాదం ప్రైవేట్ రంగ సంస్థల కంటే తక్కువ ఉంటుందని ఆయన చెప్పారు.

అలాంటిధీ సాధారణ ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా ఎఎ+ ఇచ్చే  పరిస్థితుల్లో కూడ ప్రభుత్వ రంగ సంస్థకి ఎ+ ఇవ్వడం చుస్తే విభజన గాయాలతో తీవ్ర ఆర్థిక లోటు, పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం లాంటి పరిస్థితులు ఉన్నాయని 2018 క్రిసిల్ నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. అంతటి  దారుణమైన పరిస్థితుల్లో కూడా అప్పటి ప్రభుత్వ ఆర్థిక విధానాలు ముఖ్యంగా పారిశ్రామిక అనుకూల వాతావరణం, అలాగే ఆర్థిక లోటు తగ్గడానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలు బాగుండటంతో రేటింగ్ ఎ+ ఇస్తున్నట్లు క్రిసిల్ తెలిపిందని వివరించారు.

కాగా, 2020 క్రిసిల్ నివేదిక లో రేటింగ్ తగ్గే సూచనలు ఉన్నాయని ముందే హెచ్చరించటం జరిగింది. మూడు రాజధానుల ప్రతిపాదన, అలాగే ఆస్తులను అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి  కి బదలాయించటం లాంటి చర్యలతో రేటింగ్ భవిష్యత్తు లో తగ్గబోతుందని నివేదికలో హెచ్చరించారని ఆయన గుర్తు చేశారు.
2023 లో రేటింగ్ ఎ + నుంచి బిబిబి+ కి తగ్గించటానికి నివేదికలో చెప్పిన మొదటి కారణం చెల్లింపుల లకు సంబందించి రూ 300 కోట్లు అవసరం కాగా రూ 204 కోట్లు మాత్రమే ఉండటం, బాండ్ సేవల ఖాతాలో ఉండాల్సిన నిధులు లేకపోవడం, బడ్జెట్ లో చూపిన నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలతో పాటు  ఆర్థిక లోటు పతాక స్థాయికి చేరడం అని మహేశ్వర రావు వివరించారు.