ఎవరికీ సాధ్యం కాని రోహిత్ శర్మ రికార్డు

బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల పంట పండించాడు. ఈ ప్రపంచకప్‌లో ప్రతిమ్యాచ్‌లో ఆడినట్లుగానే తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు హిట్ మ్యాన్. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్‌కు తరలించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్ మ్యాన్ అనేక ఘనతలను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ 61 పరుగులు చేసి బాస్ డి లీడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉంది.
 
 2015లో ఏబీడీ ఒకే ఏడాది వన్డేలలో 58 సిక్సులు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన రోహిత్ 59 సిక్సులతో ఈ రికార్డు అధిగమించాడు. ఇదే క్రమంలో ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సులు, అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.  మరోవైపు ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఏ బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.
నెదర్లాండ్స్ మ్యాచ్ ద్వారా 2023 వన్డే ప్రపంచకప్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్.. వరుసగా రెండు వరల్డ్‌కప్‌లలో ఐదువందలకు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.  2019 ప్రపంచకప్‌లో రోహిత్ 648 పరుగులు చేశాడు. ఇదే సమయంలో ప్రపంచకప్‌లో 500లకు పైగా పరుగులను రెండుసార్లు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 1996 ప్రపంచకప్‌లో 523 పరుగులు చేసిన సచిన్.. 2003లో ఏకంగా 673 పరుగులు సాధించాడు.

ఇక ప్లేయర్‌గానే కాదు కెప్టెన్‌‌గానూ..  రోహిత్ ఓ ఘనత అందుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో ఐదువందల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటికి వరకూ టీమిండియా తరుఫున అత్యధిక రన్స్ చేసిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ కొనసాగుతున్నాడు. 2003 ప్రపంచకప్‌లో గంగూలీ 465 పరుగులు చేశాడు. ఈ రికార్డును రోహిత్ శర్మ తాజాగా బ్రేక్ చేశాడు.

మరోవైపు ఒక ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గానూ రోహిత్ చరిత్ర సృష్టించాడు. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 22 సిక్సులు కొట్టగా ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రోహిత్ శర్మ 23 సిక్సులు బాదేశాడు.