అన్ని మ్యాచుల్లో గెలిచి చరిత్ర సృష్టించిన భారత్

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌  జైత్రయాత్రను కొనసాగించింది.   గ్రూప్‌ స్టేజ్‌లో  భారత్‌ను ఓడించే జట్టే  రాలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిదింటిలో గెలిచి  అపజయమే లేని జట్టుగా చరిత్ర సృష్టించింది.   ఈ ఏడాదిలో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగానూ నిలిచింది.  బెంగళూరు  లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా  నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో  గెలిచింది.  
రోహిత్‌ సేన నిర్దేశించిన 411  పరుగుల భారీ ఛేదనలో  డచ్‌ జట్టు..  47.5  ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్‌ అయింది.  బ్యాటింగ్‌లో అదరగొట్టిన  టీమిండియా బౌలింగ్‌లో కూడా రాణించి  తొమ్మిదో విజయాన్ని నమోదుచేసుకుంది. ఒక వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌లో లీగ్‌ దశ పోటీలు ముగిశాయి. నవంబర్‌ 15 నుంచి  నాకౌట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి.

చివరి బంతికి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మినహా.. మిగతా బ్యాటర్లంతా హాఫ్ సెంచరీలో రాణించారు. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు మరో అడుగు ముందుకేసి సెంచరీలతో చెలరేగారు. అయ్యర్ 94 బంతుల్లో 128 రన్స్‌తో నాటౌట్, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 102 పరుగులు చేశారు.

భారత్‌ నిర్దేశించిన  411 పరుగుల ఛేదనలో  నెదర్లాండ్స్‌కు గెలుపు మీద ఆశలేమీ లేకున్నా   బ్యాటింగ్‌కు అనుకూలించే  బెంగళూరు పిచ్‌పై   కాస్త ప్రతిఘటించింది.   ఓపెనర్‌ వెస్లీ బరెసి  (4)ని సిరాజ్‌  రెండో ఓవర్లోనే ఔట్‌ చేశాడు.   మరో ఓపెనర్‌ మ్యాక్స్‌ ఓడౌడ్‌  (30),  కొలిన్‌ అకర్‌మన్‌ (35) లు  రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు.   అయితే  అకర్‌మన్‌ను  కుల్‌దీప్‌ ఔట్‌ చేసి భారత్‌కు  బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత  కొద్దిసేపటికే జడ్డూ ఓడౌడ్‌ను పెవిలియన్‌ కు పంపాడు.

72కే మూడు వికెట్లు  కోల్పోయిన  నెదర్లాండ్స్‌ ను  సిబ్రండ్‌.. (80 బంతుల్లో 45) కాస్త ప్రతిఘటించాడు. ఎడ్వర్డ్స్‌ (17) తో కలిసి కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే కోహ్లీ.. ఎడ్వర్డ్స్‌ వికెట్‌ తీసి  డచ్‌ టీమ్‌కు భారీ షాకిచ్చాడు.   ఆ తర్వాత  వచ్చిన  బ్యాటర్లలో  ఆంధ్రా మూలాలున్న తేజ నిడమనూరు (39 బంతుల్లో 54, 1 ఫోర్, 6 సిక్సర్లు) ఒక్కడే కాస్త  రాణించాడు.  

అర్థ సెంచరీ  పూర్తిచేసిన అతడిని రోహిత్‌ శర్మ  48వ ఓవర్లో ఔట్‌  చేయడంతో నెదర్లాండ్స్‌ కథ ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌   తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్‌ చేయించింది.  వికెట్‌ కీపర్‌ కెఎల్‌ రాహుల్‌,  శ్రేయస్‌ అయ్యర్‌ మినహా మిగిలిన 9 మంది బౌలింగ్‌ చేయడం  విశేషం. వన్డే వరల్డ్‌ కప్‌లో ఒక జట్టు 9 మంది బౌలర్లను వాడటం  ఇది మూడోసారి మాత్రమే.

గతంలో 1987లో ఇంగ్లండ్‌.. శ్రీలంక మ్యాచ్‌లో  ఇంగ్లీష్‌ జట్టు 9 మంది బౌలర్లతో బౌలింగ్‌ చేయించింది. 1992లో న్యూజిలాండ్‌.. పాకిస్తాన్‌పై 9 మందితో బౌలింగ్‌ వేయించింది. సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో   అత్యధిక విజయాలు సాధించిన జట్లలో  భారత్‌.. ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.  ఆస్ట్రేలియా 2003, 2007లలో  వరుసగా  11  మ్యాచ్‌లలో గెలిచింది. 

ఆ తర్వాత 9 విజయాలతో (ఈ వరల్డ్‌ కప్‌లో) భారత్‌ ఉంది.   2003లో భారత్‌.. వరుసగా 8 మ్యాచ్‌లు గెలుచుకుంది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా మెగా టోర్నీలో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నాకౌట్‌ పోరులో నవంబర్‌ 15న ముంబయిలోని వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.