దీపావళి పండుగ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్నలెప్చా వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను మోదీ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘‘మన ధైర్యమైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నాను.’’ అని ట్వీట్ చేశారు.
శనివారం దేశ ప్రజలందరికీ మోదీ దీపావళి సందేశం ఇచ్చారు. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోదీ అందరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. “ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ఆయన తెలిపారు.
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసులు, సరిహద్దు భద్రత జవాన్లతో కలిసి దీపావళి పండగను జరుపుకోనున్నానని తెలిపారు. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది లెప్చా ప్రాంతం. హిమాచల్ ప్రదేశ్‌లో 260 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది చైనా. అందులో 140 కిలో మీటర్ల మేర సరిహద్దులు ఒక్క కిన్నౌర్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
లాహౌల్- స్పితి జిల్లాలో 80 కిలోమీటర్ల మేర చైనాతో సరిహద్దును పంచుకుంటుంది. భౌగోళికంగా ఈ రెండు జిల్లాల్లో విస్తరించిన చైనా సరిహద్దు ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు ఆర్మీ అధికారులు. ఈ 260 కిలోమీటర్ల పొడవులో దాదాపుగా 20 అవుట్ పోస్ట్‌లు ఉంటాయి. ఒక్కో అవుట్ పోస్ట్‌లో అయిదు బెటాలియన్ల మేర ఐటీబీపీ జవాన్లను మోహరించారు ఆర్మీ అధికారులు.
అలాంటి కీలక ప్రాంతాన్ని ఆదివారం ఉదయం ప్రధాని మోదీ సందర్శించారు. దీపావళి పండగను ఐటీబీపీ పోలీసులు, సరిహద్దు భద్రత జవాన్లతో కలిసి జరుపుకొన్నారు. ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండగ నాడు సరిహద్దులను సందర్శించడాన్ని ఆయన ఆనవాయితీగా పెట్టుకుంటోన్నారు.
కాగా దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో దీపావళి పండుగ జరుపుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది కొత్తేం కాదు. ఇది ఆయన చిరకాల సంప్రదాయంగా వస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం సాయుధ దళాలతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు.
ప్రతి దీపావళికి సైనికులు ఉండే మారుమూల ప్రాంతాలకు వెళ్లి, వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపి, వారితో పండుగ జరపుకుంటున్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత ఆర్మీ సిబ్బందిని కలిశారు. 2020లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని లోంగేవాలా పాయింట్ వద్ద సాయుధ బలగాలతో దీపావళిని జరుపుకొన్నారు మోదీ.
2019లో జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2017లో జమ్మూకాశ్మీర్‌లోని గురేజ్ వ్యాలీని సందర్శించారు. 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో, 2015లో పంజాబ్‌లోని యుద్ధ స్మారక చిహ్నాలను సందర్శించారు. 2014లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి సియాచిన్‌లో జవాన్లతో దీపావళి పండగను జరుపుకొన్నారు మోదీ.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!
అంతరిక్షం నుంచి మహా కుంభ మేళా.. ఇస్రో ఫొటోలు